My Blog List

My Blog List

Thursday, April 3, 2014

గజేంద్ర మోక్షం - గజేంద్రుని మొర:

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. 
హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.
పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అగస్త్యముని శాప కారణంగా ఇంద్రద్యుమ్నుడు త్రుకూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగు రాజయిపోయాడు. ఆ ఏనుగులరాజు దాహం తీర్చుకొందామని ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకుని , తన గుంపుతో జలక్రీడలాడుకోడం మొదలు పెట్టాడు.
ఆ సరోవరరంలోనే శాపవశాన్న మొసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ మొసలి చట్టున వచ్చి , ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ మొసలి నుంచి విడిపించుకుందామని గజేంద్రుడు యెంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులుకూడా సాయం చేయవచ్చాయి. కాని లాభం లేకపోయీంది. హోరా హోరీగా ఆ రెండూ వేయేళ్లు పోరాడుకున్నాయి.
క్రమంగా ఏనుగు అలసిపోయి , మొసలిదే పైచేయి అవవచ్చింది. గజేంద్రుడికి మరి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. పూర్వజన్మ వాసన వలన దైవచింత వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి , " నేనింక పోరాడలేను అని దేవుని ఈ విధంగా ప్రార్ధించడం మొదలు పెట్టాడు గజరాజు .

కనబడుతున్న జగత్తంతా ఎవరినుండి వస్తున్నది? ఎవరియందు నిలబడుతున్నది? తిరిగి ఎవరియందు లీనమవుతున్నది? సృష్టికి ములకారణ మెవ్వరు? ఆది మధ్యాన్తరహితుడైన వాడెవ్వడు? అలాంటి ప్రభువునకు ప్రణమిల్లుతున్నాను.
ఒకపరి లోకాలను వెలువరిస్తూ, ఒకపారి ఆ లోకాలను లోపలికి తీసికొంటూ, రెండూ తానే అయి రెండింటికి సాక్షిగా ఉంటూ ,అన్నింటికీ ములమై వెలుగుతున్న అతనికి నమస్కరిస్తున్నాను.
లోకాలున్నాయి, లోక పాలకులున్నారు, లోకస్తులున్నారు. ఇలా భిన్న భిన్నంగా గోచరిస్తున్నారు. ఈ భిన్నత్వమనే పెనుచీకటికావల ఏకాక్రుతితో వెలుగుతున్న ఆ వెలుగుల మూర్తికి నమస్కరిస్తున్నాను. 
అతడు నటన సూత్రధారి. ఈ నామరుపలన్ని అతని వివిధ భంగిమలే! అతడే ఇన్ని మూర్తులుగా గోచరిస్తూ జగన్నాటకాన్ని ఆడుతున్నాడు. అతనిని కీర్తించడానికి, అతని వర్తనాన్ని గ్రహించడానికి ఎవరికీ సాధ్యమవుతుంది? అలాంటి దేవదేవునికి నమస్కరిస్తున్నాను.
ముక్తసంగులైన మునులు, సర్వభూతహితులైన ప్రేమ స్వరూపులు, సాధువర్తనులు. వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో, ఆ పాదాలే నాకు కూడ దిక్కని నేను నమ్ముకొంటున్నాను. 
దైవాన్ని ఇలా పొడగట్టించుకొనే ప్రయత్నం గజేంద్రుని నుండి జరుగుతూ ఉండగా, మొసలి అతడిని మరింతగా వేధించసాగింది. ఆ వేధింపకు అతడు కలత చెందినవాడై.
తప్పు, తప్పు ఇలా అనరాదు. కలలోనైనా ఇలా అనుకోకూడదు. ఎన్ని సార్లు ఎందరిని ఎన్ని విధాలుగా రక్షించలేదు అతడు. ప్రార్ధించడం చేతకావాలేకాని, అతడు పలక్కపోవడం ఉంటుందా.!
కలిమి లేములతో నిమిత్తం లేకుండా కలసివచ్చే వాడతను. ఆ మాత్రం నన్ను కనికరించాడా! దుష్టులపాల పడుతున్నప్పుడల్లా శిష్టులను ఆడుకొనే వాడతను. ఆ మాత్రం నన్ను ఆదుకోడా! చూడగలిగిన కన్నుతో, తనను చూడగలిగిన వారందరిని తానుగా చూచుకొనేవాడు. ఆ మాత్రం నన్ను చూచుకోడా? తనకోసం మొరలిడే వారి మొరను తానుగా వినివచ్చి, చేయూత నందించేవాడే ఈ నా మొర వినడా!
ఇన్ని రూపులు తన రూపమైనవాడు, ఆది మధ్యాంతాలు లేనివాడు. ఆత్మ బంధువు. ఆపద్భాందవుడయినవాడు. ఈ నా స్థితిని వినడా, చుడడా, తలపడా, నా కొరకు వెంటనే తరలిరాడా! తప్పక వస్తాడు.
తండ్రీ! ఇంతవరకు నేనుచేస్తూ వచ్చినదాన్ని నేను గమనించుకొన్నాను. నా ప్రయత్నాన్ని నా ప్రయత్నంగా కొనసాగిస్తూ ,నీ అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నాను. అందువల్లనే నెమో బహుశ నా పిలుపు నిన్ను చేరలేకపోతుంది.
తెలిసికొన్నాను. నా ప్రయత్నమనేది వేరే లేదనీ, అదికూడా నీ అనుగ్రహంలో భాగమేనని తెలుసుకొన్నాను. నీ అనుగ్రహాన్ని పట్టుకొని, కొంతనాడిగా కొంత నీదిగా భ్రమపడుతున్నాననీ కూడ అర్ధం చేసికొన్నాను. ఈ నా దృష్టిని సరిజేసి కొంటున్నాను. తండ్రీ! నన్ను కరుణించు! మా ప్రయత్నమనీ, దైవానుగ్రహమనీ. ఉన్నదీ, రెండుగా కనబ్డుతున్నదీ ఒక్కటే! అదే నీ అనుగ్రహం.
ఇక నా పరిస్థితి గమనించు. 
జీవుల మాటలన్నీ వినిపించుకొంటావట నీవు. మా హృదయ ఘోషలన్నీ గమనించు కొంటావట? ఆర్తులను రక్షించడం కోసం ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడికైనా వచ్చేస్తావట? జీవులుకో అని పిలిస్తే నీవు అని పలుకుతావట. తండ్రీ , రావా, నన్ను చేరరావా! నన్నాదుకోవా ! నన్ను నీ అక్కున జేర్చుకోవా!
ఆ గజేంద్రుని మొరవిన్న శ్రీమహావిష్ణు మూర్తి ప్రక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖు చక్రాలను చేపట్టలేదు. పరివారాన్ని పిలిపించలేదు. గరుత్మంతుడు వచ్చేవరకైన ఆగలేదు. తలకట్టునైనా సరిజేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోనికి వచ్చిన పైటను ఆమెకు వదిలివేయాలని కూడా అతనికి తోచలేదు.
ఆ విష్ణువు దృష్టిలో గజేంద్రుడు మాత్రమె ఉన్నాడు. గజేంద్రుని మొరమాత్రమె అతనికిప్పుడు వినబడుతోంది. గజేంద్రుని వైపు వేగంగా సాగి వచ్చేస్తున్నాడు.
ఆ విధంగా బయలుదేరిన ఆయనను అనుసరిస్తూ లక్ష్మితో సహా మొత్తం సపరివారం వైకుంతం నుండి వారు కూడా శ్రీహరిని అనుసరిస్తూ వచ్చేస్తున్నారు.ఇంతకూ గజేంద్రుడు పిలిచిందీ ఆ ఒక్కణ్ణి ! ఆ ఒక్కడు కదిలాడు. అంతే! ఇక అంతా కదిలారు. నారాయణుడు వెనుక ముందు చూడలేదు. గజేంద్రుడి వైపుగా వచ్చేస్తున్నడంతే! ఆయన వస్తున్నప్పుడు దేవతలంతా నమస్కరిస్తున్నారు, కాని ఆయనకు గజేంద్రుని మొర తప్ప ఆయనకు ఏమి వినబడటం లేదు. అతని దృష్టంతా గజేంద్రుని పన్నే ఉంది.  
క్షణాలలో సరస్సును సమీపించాడు నారాయణుడు. సమీపించడమే తడవుగా చక్రాయుధాన్ని మకరంపై ప్రయోగించాడు. ఆ మొసలికి తల తెగి పడింది.  
అందివచ్చిన ఆ అనుగ్రహానికి అమితంగా ఆనందిస్తున్నాడు గజేంద్రుడు ఆ ఆనందంలో నుండే విష్ణు స్మరణలో ఓలలాడుతున్నాడు. విజయసుచకంగా విష్ణుమూర్తి శంఖానాదం చేశాడు.   

No comments:

Post a Comment