My Blog List

My Blog List

Thursday, April 3, 2014

సాయిబాబా దివ్యవాణి :

బాబా ఒకసారి భక్తులతో ఇలా అన్నారు :
నేను మీకు దూరంగా ఉన్నాన దగ్గరగా ఉన్నాన అని మీరు ఆలోచించవలసిన పని లేదు. మీరెక్కడ నున్నప్పటికి, ఏమిచేసినప్పటికి నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమందు చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సుత్రదారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియచాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే. ఎవరైతే తమ ద్రుష్టి నావైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగాని, బాధగాని కలుగదు. ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.

బాబా తనభక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను :
నేననగా ఎవరు? అని సాయిబాబా ఎన్నో సార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు. నన్ను వెదకుటకు నీవు దూరముగాని, మరెచ్చటకుగాని వెళ్లనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలో, చైతన్యము లేదా అంతరాత్మ కలదని అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్నింటిలోను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకాత్వమనుభవించి నాలో ఐక్యము పొందెదవు.

మానవుడు యత్నించవలసినది (శ్రీ సాయి సచ్చరిత్ర : ఎనిమిదవ అధ్యాయం)
మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్దగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకై త్వరపడవలెను. చదువు అయిపోయిన విద్యార్థి ఉద్యోగం కోసం ఏ విదంగా ఆతురతపడతాడో, యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్దకము, అలసటను, కునుకుపాట్లు దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయనిచో మనము పశుప్రాయులమగుదుము. 

ప్రార్ధన (శ్రీ సాయి సచ్చరిత్ర : 25 వ అధ్యాయము) :
ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములయందు, దుర్మార్గపు పనులందు మాకుగల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది.   

శ్రీసాయి యొక్క అనంత తత్త్వములో ముఖ్యమైనవి ౩ కలవు :
శ్రీసాయి ఇట్లనెను.
- ఊరకే గ్రంధములు చదువుట వలన ప్రయోజనము లేదు. చదివిన విషయములు విచారించి ఆచరణలో పెట్టవలెను.
- భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తులను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తులు మరేవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.
- ఎవరినీ నిందించకూడదు. తృణీకరించరాదు మరియు ఇతరుల విషయములో జోక్యము చేసుకోరాదు.



బాబా బోధనల సారాంశం :
హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయుల దేవుడైన రహీమ్ ఇద్దరు ఒక్కరే. వారిద్దరికీ భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు. అన్ని మతాలూ, జాతులు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి. వివాదములు, ఘర్షనలు, అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ పోటీ పడవద్దు. మీ అభివృద్దిని మీరు చూసుకోండి. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి దారులు. వీటిలో ఎవరికీ వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చును. ఎవరైనా నీకు అపకారం చేసిన తిరిగి వారికి నీవు అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి.
ఈ శరీరం ఉన్నప్పుడే నాది నావారు అనే బంధాలు, శరీరం నుంచి ప్రాణం బయటపడితే, దానికి ఏ విధమైన బంధాలతోను సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, ముముక్షువులకు అలాంటి స్థితిలో దేనిమీద ఆశలేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట. సాధారణ మానవులు మరణించగానే ప్రాపంచిక వ్యవహారాల ఆశ, పాశాలనుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించటం పునర్జన్మ. ప్రపంచం, శరీరం మీద కోరికలు ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమిమీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం, ముక్తి.    

శిష్యులు ఎన్ని రకాలు అన్న విషయాన్ని బాబా స్వయంగా చెప్పాడు:
గురువుకు ఏమి కావాలో గుర్తించి వారు ఆదేశించక ముందుగానే దానిని నెరవేర్చు వారు ఉత్తములు. గురువు ఆజ్ఞాపించగానే ఆలశింపక ఆజ్ఞాపాలన చేయువారు మధ్యములు. మాటి మాటికి తప్పులు చేయుచు గురువు ఆజ్ఞాపించిన కూడ ఆ పని చేయవచ్చునా లేదా అని అనుమానిస్తూ, తరువాత చేద్దాములే అని వాయిద వేస్తూ ఉండే వారు సాధారనులు. 
సాబూరి అంటే ఓర్పుతో వేచి ఉండటం. ఇది కూడ భక్తునికి చాల అవసరం. శ్రద్దలేని పూజలు, ఓర్పులేని భక్తీ ఎందుకు
పనికిరావు. అలాంటి వాటివలన సాధకులు గాని భక్తులు గాని ఉపయోగాన్ని పొందలేరు.
మనోనిగ్రహము గురించి బాబా నానాకు బోధించుట:
ఒకనాడు బీజాపూరు నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్ధమై వచ్చెను. వారిలో ఇద్దరు ఘోషా స్త్రీలు కలరు. వారు మసీడులోనికి వచ్చి బాబా ఎదురుగా మోములపై గల ముసుగు తొలగించి నమస్కరించిరి. వారిలో ఒకామె చక్కదనాల చుక్కవలె అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు ప్రక్కనే కూర్చున్న నానా యొక్క మనస్సు చలించెను. ఆమెను ఇంకోక్కసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టెను. వారు వేల్లిపోయిన తరువాత బాబా నానాతో నిన్నేలకొట్టితిని అని ప్రశ్నిస్తాడు. నామనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిస్తాడు. అవును నీవు చూచిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంతా అందంగా ఉంటె, ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా!
మనం ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతనుగాని ఇందులో గల వస్తువులను కాదు. గుడికి పోవునది దేవుని కొరకుగాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చలిస్తుంది. ఈ శరీరం ఒక రథంలాంటిది. బుద్ధి రథసారధి. ఇంద్రియాలు గుర్రాలు. గుర్రముల పగాలను రథసారధి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలడు. అట్లు గాక సారధికి గుర్రములపై అదుపు తప్పినచో వాటి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించును. గమ్యస్థానము చేరలేము. బుద్దితో ఇంద్రియాలను అదుపు చేయగలవారు మాత్రమె ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు.

బ్రహ్మజ్ఞానము గురించి బాబా బోధన :
ఓ మిత్రుడా బ్రహ్మజ్ఞానమనగా ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మకు బ్రహ్మకు భేదం లేదు. జీవుడే దేవుడు. ఈ శరీరంలో గల ఆత్మను దర్శించాలంటే అయిదింటిని భగవంతునికి సమర్పించాలి. అవి   పంచప్రాణములు, 2. పంచేంద్రియములు, ౩. మనస్సు, 4. బుద్ధి, 5. అహంకారము. ఇవన్ని మనిషికి అంతర్గంగా ఉండేవి. బహిర్గతంగా ఉండే సంపదను పరిత్యజించటం చాల తేలిక. అంతర్గత ఈ అయిదు విషయాలను త్యజించటం చాల కఠినమైన విషయం. పదునైన కత్తిఅంచుపై నడవటంలాంటిది. బాహ్యవస్తువులనే వదలలేని వారు పూర్తిగా వ్యామోహంలో ఉన్నట్లుగా అర్థం. అలాంటి వారికి అంతరంగికమైన ఈ అయిదు విషయాలు అర్ధమే కావు.
అంతేగాక ఆత్మజ్ఞాని కావాలనుకునే వాడు ముందు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి.
1.      మోక్షము లేక ప్రాపంచిక బంధాల నుంచి స్వేఛ్చ పొందాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి.
2.      ఇహలోక విషయాలపైన, పరలోక ఆశలపైన కూడ విసుగు విరక్తి కలగాలి.
3.      మానవుని ఇంద్రియాలేప్పుడు శరీరానికి బయటగల విషయాలను చూచునట్లు అలవాటుపడినవి. వాటి దృష్టిని బయటి వస్తు సముదాయముల నుంచి వేరుచేసి కేవలం శరీరం లోపల గల ఆత్మను తదేక ధ్యానముతో చూడగలగాలి.
4.      చెడు, దుర్మార్గపుదారుల నుండి బుద్దిని మర్పలేక, మనస్సును స్థిరపరచుకోలేనప్పుడు జ్ఞానము వలన కూడ ఆత్మ సాక్షాత్కారము పొందలేరు.
5.      సర్వకాల సర్వావస్థల యందు సత్యం పల్కుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు, బ్రహ్మచారిగా ఉండవలెను.
6.      తాత్కాలిక సంతోషం (ప్రాపంచిక విషయాలు) కన్నా శాశ్వతమైన మేకు కలిగించే ఆధ్యాత్మిక విషయాలనే కోరుకోవలెను.
7.      మనస్సును ఇంద్రియములను స్వాధీనమునందుంచుకొనవలెను.
8.      మనస్సును పవిత్ర పరచవలెను. మనిషి తానూ చేయవలసిన పనులను సక్రమంగా, త్రుప్తిగాను, ప్రతిఫలాపేక్షలేకుండాను నిర్వర్తించవలెను. అప్పుడు మనస్సు పవిత్రపడును. పవిత్రమైన మనస్సులో నుంచే వివేకము పుట్టి వైరాగ్యము అభివృద్ధి చెంది ఆత్మజ్ఞానము కలుగును. లోభము, మోహము, ఆశాపాశములు తోలగనిదే జ్ఞానం లభించదు.
9.      ఈ స్థితిని ప్రతి సాధకుడు తనంతట తానుగా కష్టించి సాధించుకోనవలెను.      
10.  వేదపాండిత్యం వల్లగాని, ధనాదిక్యత, కులాధిక్యత వలన గాని, బలాధిక్యత వలనగాని, మేధాశక్తి వలనగాని, ఆత్మ జ్ఞానం కలుగదు.

బాబా తన భక్తులకు ఊదీ ప్రసాదము ఇచ్చుట ద్వార ఏమి బోధించదలచెనో తెలుసుకొనవలెను:
ఈ ప్రపంచము మనకు కనిపించు ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారును. ఆఖరికి మన శరీరం కూడ అంతే, శరీరంలో నుంచి ప్రాణం పోయిన తరువాత దానిని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది. యిలాంటి ఆశాస్వితమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు, వ్యామోహాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తావెందుకు? ఆశాస్వితమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడ ఈ బూడిదవలె ఆశాస్వితమైనది అని తెలుసుకోమని హెచ్చరించటానికి బాబా భక్తులందరికీ ఈ విభూది ఇచ్చేవాడు.     

బాబా తన భక్తులు అల్పమైన కోరికలు కోరినప్పుడు ఇచ్చిన గొప్ప సమాధానం :
భక్తులు అనేక మంది బాబా దగ్గరకు వచ్చి కేవలం భౌతికమైన ధనం, అస్తిపాస్తులు, వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమె ఎక్కువగా కోరుతుండేవారు. అది నానావాలి గమనిస్తూ ఉండేవాడు. ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు విసిగిస్తూ ఉండడం గమనించిన నానావాలి వేగంగా మసీదులోకి దూసుకు వచ్చి బాబా ఎదురుగా కూర్చొని, ఓ ఫకీరు డబ్బులు కాయలుగాకాసే ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి. ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తేకాదు. మొలకెత్తిన నాటి నుంచే కాయలు కాయాలి. ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా యిస్తూనే ఉండాలి. అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ తక్షణమే ఇవ్వాలి అంటాడు. అతని ఉద్రేకాన్ని చల్లబరుస్తూ సరేనని బాబా అభయం ఇవ్వగానే పకపక నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
అప్పుడు అక్కడి భక్తులు ఈతని పిచ్చిని బాబా సమర్ధించడం బాగాలేదని ఈ విషయం గురించి బాబా ఆలోచించాలని అంటారు. అప్పుడు బాబా వారితో ఇలా అంటాడు. ఆలోచించవలసినది నేను కాదు మీరు. నేను ఈ మసీదులో మీ కోరకు జ్ఞానమార్గాన్ని చూపించి ముక్తికి అర్హులౌనట్లు చేయుటకు కూర్చొని ఉండగా మీరు మాత్రం అల్పమైన విషయాలనే మరియు విషయవంచాలతోనే వస్తున్నారు. ఇప్పటికైనా మీమీ మనోభావాలను మార్చుకోండి. ఈ జీవితంలో మనిషి సాధించవలసినది ఏమిటి? ధనమే ముఖ్యమా? కాదె! కాని దానం కూడ జీవితానికి అవసరమే? అలాంటి జీవితానికి సరిపడు ధనాన్ని ధర్మమార్గంలో తగినంతగా సంపాదించుకోవచ్చును. అందులో తప్పులేదు. అత్యాసతో ధనసంపాదనకే జీవితాన్నంత వ్రుధాచేసి మితిమీరిన ధనాన్ని సంపాదించినా అది ఆఖరికి మరణించినప్పుడు మనిషి వెంటరాదు కదా.   
నా ఆధ్యాత్మిక కోశాగారము పూర్తిగా నిండి పొంగి పొర్లుతుంది. ఎవరికీ ఏమి కావలనన్న ఇవ్వగలను. వారంతట వారు కూడ వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకొనవచ్చును. కాని అందుకు తగినంత అర్హతను ముందుగా పొందవలెను. నేనిచ్చునది పుచ్చుకొనుటకు ఎవరు ఇష్టపడరు. వారు కోరినదే వారికి కావలెను.నేను విలువైన బంగారము ఇచ్చుటకు సిద్దముగా యుంటిని. కాని వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుతున్నారు.
మనము ఎక్కడి నుండి ఈ మానుష శరీరంలోకి వచ్చితిమి. ఇక్కడ ఉండి ఏమి చేయుచుంటిమి, చివరకు శరీరంలో నుండి ఎక్కడికి వేల్లుచుంటిమి? చావు పుట్టుకల ఈ చదరంగాన్ని నడిపించేదేవారు? కనిపించు సూర్యచంద్రాదులు, నక్షత్రములు, గ్రహరాసులను సృష్టించినవారెవరు? వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు. కేవలం ధనము, శారీరక సుఖము సంసార విషయలోలురై ఈ శరీరమే శాస్వితమనే భ్రమలోపడి దీపమును ఆకర్షించబడి ఆ వేలుగులోపడి కాలిపోయే పురుగులవలె మానవులు నశింపువైపే మొగ్గుచూపెదరు. ఇది పూర్తిగా అజ్ఞానము. జ్ఞానమార్గము దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. మానవజాతిని జ్ఞానమార్గానికి మరలించటానికే ఈ నా శరీరం ఏర్పడినది, అని బాబా వారికి సుదీర్ఘమైన సందేశము నిచ్చెను.       
అనేకసార్లు బాబా తన బోధనలద్వార నేను అనే పదమును వివరణను ఇస్తూ ఉండేవారు. నన్ను తెలుసుకొనుటకు నీవు ఎక్కడికో పరుగులు తీయవలసిన అవసరం లేదు. నీ శరీరానికి గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగులునది నేనే. నీలోనేగాక సకల ప్రాణికోటి యందు సమానముగానే యున్నాను. దీనిని మీరు గుర్తించినచో సకల ప్రాణులలోను నన్నేమీరు చూడగలరు. మీరు ఏ ప్రాణిని హింసించిన నన్ను బాధపెట్టినట్లే. ఇతరుల వలన మీకు కలుగు కష్టనష్టములను సహించి ఓర్చుకోనువారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెపుతూ ఉండేవారు.

సాయిబాబా ఉపదేశములు:
(మన దైనందిన జీవితంలో ప్రవర్తించవలసిన తీరును గురించి బాబా తరచుగా ఇలా చెపుతూ ఉండేవాడు.)
గతజన్మ సంబంధమువలననే ఇప్పుడు మనము ఒకరి నొకరు కలుసుకోనుచున్నాము. ఏమనిషైనా, ఏ జంతువైనా నీ దగ్గరకు వచ్చినపుడు నిర్ధాక్షిన్యముగా తరిమి కొట్టవద్దు. చక్కగా ఆహ్వానించి తగిన మర్యాద చేయవలెను. దాహముతో నున్న వారికి నీరు, ఆకలితో ఉన్న వారికి అన్నము, దిగంబరులకు బట్టలు ఇవ్వవలెను. నీ వసారా ఇతరులు కూర్చొని విశ్రాంతి తీసుకొనుటకు ఉపయోగపడినచో భగవంతుడు నీపట్ల సంతృప్తి చెంది నిన్ను అనుగ్రహించును. ఎవరైనా ధనము కొరకు నీ దగ్గరకు వచ్చిన నీ కిష్టము లేకున్నవారికి ఈయనక్కర్లేదు. కాని కఠినముగా మాట్లాడి వారి మనసు నొప్పించవద్దు. ఈ ప్రపంచము నడక ఒక నాటకరంగము వంటిది. నీ ముందు జరుగు చిత్రవిచిత్రమైన ఈ నాటకమును శ్రద్ధతో చూచుచుండుము. ఈ ప్రపంచము తలక్రిందులైనా నీవు చలించకుము. స్థిరముగా నుండుము. నీకు నాకు భేదము లేదు. మనిద్దరము ఒక్కటే. నీకు నాకు మధ్యగల గోడను తొలగించుము. మనందరికీ భగవంతుడే యజమాని. అల్లామాలిక్ హై! భగవంతుడు తప్ప ఇతరులెవ్వరు మనలను కాపాడలేరు. భగవంతుని మార్గము అసాధారణమైనది, చాల విలువైనది. మనము ఉహించలేనిది. మన మందరము ఋణాను బంధముచే ఇక్కడ కలిసితిమి. పరస్పర ప్రేమతో కుల, మత, జాతి భేదాలు మాని మానవులందరు సుఖశాంతులతో వర్ధిల్లాలి. పరోపకారమునకు భగవంతుడిచ్చిన ఈ శరీరమును ఉపయోగించవలెను. అట్టి వారి జీవితమే ధన్యము మిగిలిన వారంతా పేరునకే బ్రతికెదరు.

ఏదైనను మనసుతో భగవంతునికి సమర్పించడం వలన కలిగే లాభమే జ్ఞాన సముపార్జనకు మొదటిమెట్టు (సాయిబాబా) :     

పంచేద్రియముల కంటే ముందుగానే మనసు, బుద్ధి విషయములపై వాలి వాటి వాసనలను అనుభవించును. విషయ వాసనలను వదిలి పంచేద్రియములు ఉండలేవు. అందవలన విషయములకు ఇంద్రియములకు మధ్య భగవంతునిని ఒక అడ్డుగా పెట్టినచో మనస్సు యొక్క పరుగు వేగముతగ్గెను. ఏదైనను ముందు భగవంతునికి సమర్పించినచో దాని యందు వ్యామోహము తగ్గును. ఇట్టి భౌతిక విషయములలోనే కాక కామ, క్రోధ, లోభమోహాదులను కూడ గురువున కర్పించిన క్రమముగా చిత్తవ్రుత్తులన్ని నశించును. దీనివలన విషయ విచక్షణా జ్ఞానము కలిగి చక్కని గుణశీలమును వ్రుద్దియగును. సద్గుణముల వలన దేముని యందు నిశ్చల ప్రేమ పెరుగును. దైవానుగ్రహము వలన నేను దేహినికాను అను సత్యము దర్శనమౌను. అప్పుడు మాత్రమె బుద్ధి శుద్దచైతన్యములో లీనమగును. ఇదే ఏకాత్మ భావన. మొదట నేను వేరు విషయ వస్తువు వేరు అనుభవము ఉండును. అందువల్లనే వేరుగా కనిపించే విషయవస్తువు కొరకు మనసు పరుగులు పెడుతుంది. నేను, బయటగల విషయవస్తువు ఒక్కటే అనే ఏకాత్మభావన కలిగినప్పుడు తనకు వేరైనది బయట లేదు అని తెలుసుకోగలిగినప్పుడు, తన రూపమే బయట అనేక విధములుగా ఉన్నదనే సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు మనస్సు దేనికొరకు, ఎటూ పరుగులు తీయవలసిన అవసరం ఉండదు. ఉన్నతమైన ఈ స్థితి మనిషి చేరుటకు మొదట సర్వం భగవదార్పనమే తోలి సాధన కార్యక్రమముతో ప్రారంభించాలి. మీ ఆలోచనలకూ, ఆశయాలకు, జీవిత గమనానికి నన్నే లక్ష్యంగా చేసుకున్న మీరు పంచేంద్రియముల ద్వార పొందే ప్రతి అనుభవాన్ని నాకు సమర్పించాలి. లేనిచో మీరు ఇంద్రియములను జయించలేక కోరికలకు బానిసలై తప్పు దారినపడు ప్రమాదం వచ్చును.

No comments:

Post a Comment