My Blog List

My Blog List

Monday, December 23, 2013

పరిమితితోనే పరమానందం.

ఓం నమో పరమాత్మయే నమః 

ఆధునిక కాలమంతా ధనార్జనతోనే గడచిపోతూంది. సంపాదించిన ఆధనాన్ని కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే అదీ సందేహమే! మనం ఏవస్తువునూ అవసరానికి మించి కోరకూడదు. ఒక వస్తువును కొనేటప్పుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొంటాం. కానీ ఆవస్తువు మనకు అవసరమో, కాదో ఆలోచిస్తున్నామా? వస్తు సముదాాన్ని వృథాచేసుకుంటూ పోవడంవల్ల మనకు సుఖం అధికమవుతుందని అనుకోవడం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. ఈవిషయం మనం గుర్తించగలిగితే మన ఆచారాలు, అనుష్ఠానాలు వదలుకొని దేశాంతరాలకు పోయి మరీ విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు. ఆత్మవిచారానికీ, ఈశ్వర ధ్యానానికీ, పరోపకారానికీ మనకు కావలసినంత సమయం కావాలంటే, అవసరాలకు మించి వస్తువును సముపార్జించే లౌల్యాన్ని వదిలిపెట్టాలి. మనం రెండు విధాలుగా కాలాన్ని వ్యయం చేస్తున్నాం. ఒకటి ధనార్జన కోసం, రెండవది ఆ ధనార్జనతో సంపాదించిన వస్తువుల రక్షణ కోసం! ఈరెండింటి నుంచి కాస్త మనస్సును మళ్ళించగలిగితే, ఆత్మ తుష్టికరములైన సాధనలు చేసి జీవితాన్ని శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ, తృప్తిగానూ గడపవచ్చు. ఈపొదుపు వస్తువుల విషయంలోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. పదిమాటల్లో చెప్పవలసిన విషయాన్ని ఒక్కమాటలో చెప్పగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడు మనకు ఈవిధైన వాచాసంయమనం కలుగుతుందో, అప్పుడు బుద్ధిలో తీక్ష్ణమూ, వాక్కులో ప్రకాశమూ మనం చూడగలం. మనవాక్కులు వ్యర్థం కాకూడదు. మౌనేన కలహం నాస్తి; మౌనం వల్ల కలహాలు పొడసూపే అవకాశమే ఉండదు కదా! మితభాషణ వలన మనశ్శాంతి, ఆత్మశ్రేయస్సూ వృద్ధిచెందుతాయి. కానీ ఈకాలంలో మనం చూస్తున్నదంతా వాగాడంబరమే! పొదుపు ఒక్క చేతల్లోనే కాకుండా మాటల్లో కూడా ఉండాలి. భాషణలో కూడా పరిమితిని పాటిస్తే ప్రశాంతంగా ఉండగలం. దాతృత్వంతోనే లక్ష్మీకటాక్షం: నిజానికి అన్ని కోరికలూ సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. కొత్త, కొత్త సంకల్పాలు ఉదయించకుండా చూసుకుంటే కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన తగ్గుతూ వస్తాయి. సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తువులపై దృష్టి నిలపాలి. అప్పుడు చిత్తవృత్తులు సమసిపోయి, ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలోనే సత్కార్యాల కోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతోమంది ఉన్నారు. లోకంలో ఎంతోమంది దుఃఖితులూ, దరిద్రులూ ఉంటే, వారు కష్టపడుతూ ఉంటే, మనం వృథాగా ధనాన్ని ఖర్చుపెట్టడం పాపం. మన ధనంతో దీనుల దుఃఖాశ్రువులను తొలగించగలిగితే అంతకన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. సంపద ఉండగానే సరిపోదు! దానిని సద్వినియోగం చేస్తున్నామా? పరోపకారానికి అది ఉపయోగపడుతుందా? దీనజనోద్ధరణము సహాయపడుతుందా? అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇలా సంపద సద్వినియోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది.


దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ?

ఓం నమో పరమాత్మయే నమః 

ప్రతి ఒక్కరు దేవుని ముందర టెంకాయ కొడతారు. ఎందుకు కొడతారో ఎవరికీ తెలియదు. నిజానికి మన పెద్దలు ఒక మంచి కార్యం(జ్ఞానబోధ) కోసం టెంకాయ అనే ఒక కాయ ద్వార మనకు జ్ఞాన సందేహాన్ని తెలుపడానికి వారు ఆ విధంగా టెంకాయను పరిచయం చేశారు. కాని మనం మాత్రం దేవుని ముందర టెంకాయ కొట్టి కోరికలు కోరుకుంటే అవి అన్నియు నెరవేరుతాయని మనం టెంకాయను కొడుతున్నాము. నిజానికి మనం కోరుకోడానికి పుట్టలేదు. అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలను తొలగించుకోవడానికి పుట్టాము. ఇది తెలుసుకోండి. దేవుని ముందర కోరికలను కోరవద్దు. నీకేమి అవసరమో ఆయనకు తెలుసు.

ఇంకో విషయం ఏంటంటే టెంకాయ కొట్టిన తరువాత అందులో మోసు (అంటే లింగాకారంగా) వచ్చిందంటే చాల మంచిది అని కూడ అంటారు. అవును అండి నిజమే..! కాని టెంకాయను(మనస్సును) పగలకొట్టి లోపల మోసు(ఆత్మ) ఎలాగో, అదేలాగు నీ మనస్సును నశింపజేసి ఆ భగవంతునిని నీ హృదయంలో దర్శించుకోవడం అని దాని అంతరార్ధము. అంతేకాని, నీకు ఎదో కోట్లు కోట్లు డబ్బులు సంపాదించకుండానే వస్తాయి అని కాదు. అంతరార్ధాన్ని గ్రహించండి. సత్యాన్ని తెలుసుకోండి. దానిని మీ పిల్లలకు తెలియజేయండి. మన వాళ్ళు అంతా కళ్ళున్న గుడ్డి వాళ్ళ మాదిరి నడుస్తున్నారు. మన పిల్లలకు అన్న అన్ని విషయాలు తెలుసుకొని వారికి మంచి బంగారు భవిష్యత్తు అంటే ఆ పరమపదం చేరే మంచి బాట (దారి) ని తెలుపండి. ఆ దేవదేవుని మార్గమైన మోక్షమార్గం ఒక్కటే శాశ్వతం. మిగిలినవి అన్నియు అశాశ్వతం. మీ పిల్లలను చిన్నప్పటి నుండే ముముక్షువులుగా మార్చండి అంటే మోక్షం పొందాల అనే ఒకేఒక ఏకైక లక్ష్యాన్ని ఉంచుకోమని వారికి తెలియజేయండి. చిన్నపాటి నుండే యోగాభ్యాసాన్ని అలవాటు చేయండి. చిన్నప్పుడు అయితే వారి మనస్సు నిర్మలంగా ఉంటుంది, వారు తొందరగా ఆ దేవదేవునిని హృదయంలో దర్శించుకోవచ్చు. మీ పిల్లల భవిష్యత్తును మంచి మార్గంలోకి తీసుకెళ్ళండి.

భగవంతుని మాయ అంటే ఏమిటి? :

ఓం నమో పరమాత్మయే నమః 

భక్తునిపై మాయ ప్రభావం మాయ దైవీ శక్తి. భగవంతుని నుండే వచ్చింది. ఆయన అధీనంలో ఉంటుంది. మాయను దాటడం చాలా కష్టం. భగవంతుణ్ణి ఆశ్రయించిన వారే దాన్ని దాటగలరు. "ఎవరైతే నన్నే శరణాగతితో వేడుకుంటారో వారిని తరింపజేస్తాను" అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో హితవు పలికారు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మాేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే!! యా’ ’మాఏదిలేదో అదే మాయ అంటారు శ్రీరామకృష్ణులు. నేనూ, నావారు, భార్య, భర్త, పిల్లలు అనుకోవడం మాయ. అందరూ తనవారే అనుకొని వారికి సహాయం చేయడం దయ అంటారు. వేదాంత పరిభాషలో దీన్ని అనిర్వచనీయం అంటారు. భగవంతుణ్ణి మరిపింపజేసి ఈప్రపంచమే సర్వస్వం అనుకొనేలా చేసేది మాయ. అరిషడ్వర్గాలైన కామక్రోధలోభమోహమదమాత్సర్యాలకు లోనై ఉండేవాడు మాయలో ఉన్నట్లే.

భగవంతుడే సత్యం, మిగతాదంతా అసత్యం అనే భావన వచ్చినప్పుడు మాయను అధిగమించవచ్చు. "ఎవరు మాయను దాటగలరు" అని రెండుసార్లు ప్రశ్నించి, "అవతార పురుషులనూ, మహాత్ములనూ సేవించినవారే మాయను దాటగలరు" అని భక్తి సూత్రాల్లో నారదమహర్షి చెప్పారు. అవ్యక్తనామ్నీ పరమేశ శక్తి రనాద్యవిద్యా త్రిగుణాత్మికా పరా కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్సర్వమిదం ప్రసూయతే’ - వివేకచూడామణి శ్లోకం 110 '...మహాద్భుతా నిర్వచనీయ రూపా’ - వివేకచూడామణి 111 దీనిపేరు అవ్యక్తం. త్రిగుణాత్మికమైనది దీని రూపం. అనాది అయిన అవిద్యా స్వరూపం. ఈ జగత్తు అంతా మాయవల్లే పుడుతోంది. వర్ణింప శక్యం కానిది. మహాద్భుతమైనది మాయ. శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ్యా సర్పభ్రమో రజ్జు వివేకతో యథా...వివేకచూడామణి 112 మునిమాపు వేళ పాము, త్రాడు అనే జ్ఞానం కలగగానే భ్రమ తొలగినట్లు అద్వితీయ శుద్ధ బ్రహ్మ జ్ఞానం కలగడంతోనే మాయ తొలగుతుంది. ఒకసారి నారదుడు నీ మాయను చూడాలని ఉందిఅని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. శ్రీకృష్ణుడుఅతణ్ణి తీసుకొని ఎడారి మార్గంలో వెళుతూ దప్పికై, కొంచెం మంచినీళ్ళు కావాలని కోరాడు. నారదుడు అల్లంత దూరాన ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉన్న కన్యను చూసి మోహించాడు. ఆమెను పెళ్ళి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకసారి వరద వచ్చింది. భార్యా, పిల్లల్ని రక్షించబోయి అందరినీ వరదలో పోగొట్టుకొన్నాడు. అప్పుడు విలపిస్తున్న నారదుణ్ణి, శ్రీకృష్ణుడు తన చేతితో స్పృశించి "నారదా! మంచినీళ్ళు ఏవీ?" అని అడిగాడు. అప్పుడు నారదుడికి స్పృహ వచ్చింది. ఇదే మాయ. క్షణంలో అంతా మరిపిస్తుంది. భగవంతుని కృపతోనే మాయను దాటవచ్చు. మాయను గురించి వివరిస్తూ  ఉన్న వస్తువు (బ్రహ్మ) ఒక్కటే. ద్రవ్యమో! చైతన్యమో!! వాటిని రెంటినీ విడదీసి ఆలోచించడం కష్టం. అదే మాయ. అదే అజ్ఞానంఅన్నారు స్వామి వివేకానంద.

Sunday, December 22, 2013

మనస్సును నియంత్రించడం ఎలా?


ఓం నమో పరమాత్మయే నమః 

మనసు అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడింది అనేది ఇంతకూ ముందు మనం తెలుసుకున్నాము, అంతేకాక దీనిని ఎందుకు జయించాలో కూడ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ మనస్సును ఎలా నియంత్రించాల అనే విషయాన్ని చూద్దాము.

నిజానికి ఈ మనస్సు చాల చంచలమైనది, ఎంతగా అంటే సముద్రములో అలలు ఏ విధంగా ఆగకుండా వస్తూనే ఉంటాయో అదేలాగు ఈ మనస్సులో కూడ చలనాలు నిరంతరం vవస్తూనే ఉంటాయి. ఇంతటి చంచలమైన మనస్సును నియంత్రించడం అంటే ఒక రకంగా చూసుకుంటే కష్టమే. కాని దీనిని నియంత్రించవచ్చు. దీనిని నియంత్రించడానికి మూడే మూడు సాధనాలు ఉన్నాయి. అవియే జ్ఞానం, వైరాగ్యం మరియు యోగాభ్యాసం. ఈ మూడు సాధనాల ద్వార ఎంతటి వాడికైనా ఈ మనస్సు లొంగుతుంది.    
ఈ జ్ఞానవైరాగ్యాలతో పాటు మరీ ముఖ్యంగా కామ.క్రోద,లోభ,మోహ,మద,మాత్సార్యాలు అను అరిషడ్వర్గాలను అదుపులో ఉంచడం మరీ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ అరిషడ్వార్గాల మూలంగానే మనసు ముఖ్యంగా కలత చెందుతుంది. అందువలన మొదట మనం అందరం వీటిని సంపూర్ణంగా వదిలివేయాలి. ఎప్పుడైతే వీటికి మనం దూరం అవుతామో, అప్పుడు మన మనస్సుకు ఒక నిశ్చలతత్వం వస్తుంది. అప్పుడు సుక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞానం తొందరగా అవగతమవుంది. ఎప్పుడైతే జ్ఞానం మనకు అవగతమవుతుందో, అప్పుడు automatic గా కనిపించే వీటి అన్నిటిమీదా ఒక వైరాగ్య భావన మనస్సుకు కలుగుతుంది, ఎందుకంటే కనిపించే ఇవన్ని ఎప్పటికైనా నశిస్తాయి కదా...నశించిన ఇవి అన్నియు మరల ఒక శక్తిగా మారుతాయి కదా. అంటే నేను ఇన్నాళ్ళు తెలియక ఈ నశించే వీటి కోసమా ఎంపర్లాడుతున్నాను అనే సంపూర్ణ వైరాగ్యం మనస్సుకు స్థిరపడుతుంది. ఎప్పుడైతే వైరాగ్యం మనస్సుకు కలుగుతుందో, అప్పుడు నిత్యమైన దాని కోసం పరుగుపెడుతుంది. అప్పుడు యోగాభ్యాసం (ధ్యానం) మీదకు మనస్సు మరలుతుంది. ఎప్పుడైతే యోగాభ్యాసం చేయడం మొదలవుతుందో, అప్పటి నుండే మనసు సంపూర్ణంగా ఒక నిశ్చల స్థితికి వస్తుంది. అలా నిశ్చల స్థితిలో ఉన్న మనస్సు, ప్రతీ రోజు యోగాభ్యాసం అవలంబించడం వలన మనం సమాధి స్థితికి వెళతాము.   
మన మనసు ఎప్పుడు అయితే ఒక నిశ్చల స్థితికి వస్తుందో అప్పుడు మనస్సు లయించబడుతుంది. ఈ విధంగా లయించబడిన మనస్సు, ధ్యానంలో ఒకే ఒక వస్తువును ధ్యానించటం ద్వార నశించబడుతుంది. లయించిన మనస్సు మళ్ళీ పుట్టే అవకాశము ఉంటుంది, కాని నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. ఈ విధంగా మనస్సును నశింపజేస్తే, మనకు ఆ భగవంతుని దివ్య దర్శనం హృదయంలో తొందరగా అవుతుంది.
మనం ఎంత తొందరగా అరిషడ్వర్గాలను జయిస్థామో అంత తొందరగా మనస్సు లయమవుతుంది. ఈ విధంగా లయమయిన మనస్సు జ్ఞాన వైరాగ్యాలు మరియు యోగాభ్యాసంచేత నశింపబడుతుంది.    

ఈ మనస్సును నియంత్రించడానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విధంగా తెలిపాడు.
-          కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.
-          విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.
-          అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
-          గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.
-          అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
-          పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు.
-          ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.

Thursday, December 19, 2013

మనసు అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది.

ఓం నమో పరమాత్మయే నమః 

మనసు అనే పదం దాదాపు ప్రతి రోజు ఎదో ఒక విషయంలో మనం అందరం అనుకుంటూ ఉంటాము. మనిషి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదురా! వాని మనసు బాగుండాలి అని కూడ అంటూ ఉంటారు. కాని ఈ మనసు ఎక్కడ వుంది అంటే మాత్రం ఎవరికీ తెలియదు. దీనినే చాల మంది అంతరం అని కూడ అంటారు. ఇది అన్నిటికంటే చాల వేగమైనది కూడ. అది ఎలా అంటే నీవు ఏదైనా అనుకుంటే నీ మనస్సు అక్కడికి వెళుతుంది అంటారు. దీనినే మనం మనిషివి ఇక్కడే వున్నావు, నీ మనస్సు ఎక్కడో వుంది అని అంటుంటారు.


ఈ మనసు చాల చాల సున్నితమైనది. అందుకే ఇది ప్రతి చిన్న విషయానికి react అవుతుంది. మనసుకు ఓపిక చాల తక్కువ మరియు సహనం కూడ తక్కువే. కాని ఇంతటి ఓపిక, సహనం లేని మనస్సుకు ఒకే ఒక దాని ద్వార ఓపిక, సహనం, అన్నిటికి మించి ప్రశాంతత మరియు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఇక్కడ ఆనందం అంటే చాల మంది అనుకోవచ్చు, ఇప్పుడు నాకేమి ఆనందంగానే వున్నాను కదా అని. కాని ఇప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా తాత్కాలిక ఆనందం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పొందే ఆనందం వేరే ఏదైనా ఇంకొక విషయానికి మరల అది బాధపడుతుంది. ఈ ఆనందం చాలా రకాలుగా వుంది. ఈ ఆనందం ఎన్ని రకాలు అనేది బృహదారణ్యకోపనిషత్ లో చాల బాగా విశదీకరించి చెప్పారు, అది మనుజులలో ఎవడు సకల భోగములు అనుభవించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది. దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును ఆజానదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము”. దీనిని బట్టి మనకు అర్ధమైనది ఏమిటంటే మనం ఇప్పుడు పొందే ఆనందం అసలు ఆనందమే కాదు. శాశ్వతమైన పరమానందమైన ఆనందాన్ని పొందినపుడు మాత్రమే మనం అసలు సిసలైన ఆనందాన్ని పొందిన వాళ్ళమవుతాము.


సరే కాని ఈ మనస్సు అంటే ఏమిటి, అది ఎలా వుంటుంది అంటే మాత్రం, ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరకదు కాని అది ఒకేఒక అధాత్మికలో మాత్రమె దొరుకుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే అసలు మనస్సే లేదు అని తెలుస్తుంది. ఎలా అంటే వున్నది ఒక ఈ శరీరం మరియు ఆత్మ. నిజానికి ఉండేవి ఈ రెండే, కాని ఏమైంది అంటే మనం కలిగిన భావనలను ఆ ఆత్మ (శక్తికి) కు ఒక తెరగా ఏర్పరచాము అదేలాగు అంటే మనం గుడికి వెళితే హారతికి ముందు దేవుని ప్రతిమ కనబడకుండా ముందర ఒక తెల్లటి వస్త్రాన్ని అడ్డంగా వేస్తారు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ప్రక్కకు తీస్తారో అప్పుడు దేవుని ప్రతిమ మనకు కనిపిస్తుంది అదేలాగు మనం కూడ ఇక్కడ ఒక తెరను ఏర్పరచాము, అదియే మనస్సు. ఈ మనసు ఎలా ఏర్పడింది అంటే ప్రతి రోజు ఈ శరీరం చేసే ప్రతి పనిని మరియు క్రియను మనం, నేను అనే అహంకార భావనతో చేయడం వలన ఇది ఏర్పడింది. ఈ విధంగా మనకై మనం అజ్ఞానంలో అశాశ్వతమైన మరియు నశ్వరమైన ఈ ప్రపంచంలో నావి అనే ఒకే ఒక భావనతో ఏర్పడిన తెరయే ఈ మనస్సు. ఈ విధంగా మనకై మనం ఏర్పరచిన ఈ మనస్సే ఇప్పుడు మనలను శాశించే స్థాయిలో వుంది.దీనిని మనం ఏ విధంగా అజ్ఞానంతో ఏర్పరచామో, అదే విధంగా జ్ఞానంతో నియంత్రించి మన నిర్దిష్టమైన, లక్ష్యమైన మరియు మన ధ్యేయమైన ఆ పరమాత్మునిని హృదయంలో దర్శించుకోవచ్చు. ఈ మనస్సును మనం నియంత్రించగలిగితే అదియే మనకు అసలు సిసలైన మిత్రువు లేకపోతే నీ పతనానికి అదియే మొదటి శత్రువు. చాల మంది అనుకుంటారు శత్రువులు బయట వుండారు అని, కాని అసలు శత్రువు నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న తెరయైన నీ మనస్సే నీ శత్రువు. ఇది అందరు గుర్తుంచుకోవలసిన విషయం.
ఎప్పుడైతే మనం మనలో సాత్విక గుణాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మన మనసు అంతఃకరణ శుద్ది అయి ఆ పరంధాముని జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరమాత్ముని జ్ఞానం మరియు తత్వం అర్థమవుతుందో అప్పుడు మన మనసుకు automatic గా నిదానత్వం, సరళత, ఓపిక, సహనం, నిర్మలత్వం మరియు ప్రశాంతత చేకురుతాయి. వీటి అన్నిటికి మించి పరమానందం పొందాలంటే మాత్రం జ్ఞానం ఒకటి సరిపోదు. మనం తెలుసుకున్న జ్ఞానంతో ఆ దేవదేవుడైన పరమాత్మ స్వరూపుణ్ణి నీ హృదయంలో దర్శించడం వలన మాత్రమె సాధ్యం.


నీ మనసును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు. అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని (నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని) దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది. దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.


ఈ మనస్సు గురించి రమణ మహర్షి తెలిపిన ముఖ్యమైన విషయాలు :
-
వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
-
మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
-
ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
-
మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
-
వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
-
లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
-
ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.

Wednesday, December 4, 2013

ధ్యానం అంటే ఏమిటి? ఎలా చేయాలి :

ఓం నమో పరమాత్మయే నమః 

ధ్యానం, ధ్యానం, ధ్యానం ఎందుకు చేయాలి? నా పనులన్నీ పక్కన పెట్టి చేయవలసిన అవసరం నాకేమి ఉంది. ఇప్పుడే నాకు వచ్చిన తొందర ఏముంది. నా వయసు ఇంకా 25+ కదా. ఇప్పుడు బాగా enjoy చేయాల్సిన వయస్సు. బాగా సంపాదించాల్సిన వయస్సు. ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వాటిని అన్నిటిని పక్కన పెట్టి ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత తొందర ఏమొచ్చింది? పైగా ఇంకా ఎన్నో భోగాలను అనుభవించవలసిన వయస్సు. ఇప్పుడే అన్ని వదులుకొని నా సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం నాకేమి వుంది. పైగా ధ్యానం లో కూర్చుంటే ఆలోచనల మీద ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇది మన వల్ల అయ్యే పని కాదు. అయిన నాకేమి అంత మించి పోయే వయసేమి రాలేదు కదా. అవును అండి. మీరు అలోచించినవి అన్నియు నిజాలు. పచ్చి నిజాలు.

కాని ధ్యానం ఒకప్పుడు (అంటే పూర్వ కాలంలో) చేసుకునే వాళ్ళు, వాళ్ళంతా అప్పుడు భగవంతుని దివ్య దర్శనాన్ని హృదయంలో దర్శించుకోవడం కోసం. కాని ఈ కాలంలో కూడా ధ్యానం చేసుకుంటున్నారు అయితే ఎప్పుడు అంటే ఆరోగ్యం బాగాలేక doctor దగ్గరికి వెళితే, అప్పుడు doctor గారు చెపితే  (లేక) చదువు మీద శ్రద్ధ నిలువలేక ఏకాగ్రత కోల్పోతుంటే (లేక) ఎవరో విదేశస్తులు మనకు సలహాలు ఇస్తే ఎందుకటే ఇప్పుడు మనం అంతా విదేశీ సాంప్రదాయాల మీద ఆధారపడివున్నాము కదా అందుకు ఎవరో చెపితే అప్పటి వరకు మనం దాని మీద concentrate చెయ్యం. ఇవి కూడ నిజాలే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన. కాని ధ్యానం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు చాలానే వున్నాయి, అవి శారీరకంగా మరియు మానసికంగా, రెండు విధాల ఉపయోగమే.

ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏమి లేదండి. ఇది చాల సులువైన ప్రక్రియే. అందరూ చెప్పినట్లుగా ఏవేవో ఆసనాలు ఏవేవో నియమాలు ఏమి అవసరం లేదండి. మనకు అనువుగా ఎట్లా కావాలంటే అట్లా కూర్చోవడమే ఆసనం.నియమాలు అసలేమి లేవండి. మీకు అనువుగా ఎట్లా కావాలంటే చేతులను అట్లా పెట్టుకోండి. మీరు రోజు చేసుకునే కార్యక్రమాలు అన్నియు చేసుకోండి మరియు అన్నీ తినండి. ఇంకో విషయం ఏమిటంటే ధ్యానం అంటే మీరు పద్మహాసనం వేసుకొని కూర్చొని వుంటే మాత్రమే చేసుకోవలసిన పని లేదు. ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు కూడ ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ధ్యానం అంటే పరిపరివిధాల పోయే మన మనస్సును ఒకచోట నిలిపే ప్రక్రియనే (దీనినే యోగం) ధ్యానం అంటారు. ఒకవేళ మనసును ఒకచోట నిలపలేక పోతే దానికి కొన్ని పద్దతులు వున్నాయి. మనసును నిలపాలంటే *జ్ఞానవైరాగ్యాల చేత మరియు *అభ్యాసం(అంటే సాధన) చేత మనస్సును నిలపవచ్చు. మొదట్లో కొద్దిగా కష్టంగా ఉన్న తరువాత ప్రతి రోజు ధ్యానం చేసుకుంటూ వుంటే అదే నిదానంగా ఒక అచేతన స్తితికి వస్తుంది. అయితే క్రమం తప్పకుండా చేసుకోవాలి. మొదట్లో కొన్ని నిముషాలు ఆ తరువాత నిదానంగా సమయాన్ని పెంచలే తప్ప తగ్గియ్యకూడదు సుమా. గుర్తుంచుకోండి. ఎందుకంటే మొదట్లో ఆవేశంలో ఎక్కువసేపు చేసుకొని ఆ తరువాత కొద్దిగా పనుల భారమో లేక ఏవేవో వ్యవహారాల మూలంగా సమయాన్ని తగ్గియ్యడానికి ప్రయత్నిస్తారు. అందుకే మొదటి నుండే ఒక సమయాన్ని fix చేసుకోండి. అవి...
1.      ఉదయం లేచిన వెంటనే brush చేసుకొని ఒక గంట సేపు ధ్యానం చేసుకోండి. స్నానం చేసి చేస్తే ఇంకా మంచిదనుకోండి.
2.      సాయంత్రం 6 గంటల తరువాత ఒక గంట సేపు ధ్యానం చేసుకోండి.
3.      మరల రాత్రి పడుకునే ముందు ఒక అర్ధ గంట సేపు కూర్చొని ధ్యానం చేసుకోండి.

అన్నిటికంటే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే చాల మంది చాల చెప్తూవుంటారు, ధ్యానం చేసుకునేటప్పుడు ఎదో ఒక దేవుని పేరునో లేక ఎదో ఒక మంత్రాన్నో లేక ఓం అనో వుచ్చరించమని చెప్పి వుంటారు. కాని ఇవన్ని ఏమి వద్దు. ధ్యానం చేసుకునేటప్పుడు పాటించవలసినవి.
1.      ఆసనం - నీకు అనువుగా ఉండే అట్లు కుర్చోవచ్చు
2.      చేతులు - నీ చేతులను నీకు ఎట్లా అనువుగా వుంటే అట్లా పెట్టుకోవచ్చు.
3.      మనస్సును ప్రశాంతంగా హాయిగా ఆనందంగా వుంచుకొని ఎటువంటి మంత్రం జపించాకుండా, హృదయంలో దివ్య జ్యోతి వుందని సంపూర్ణ విశ్వాసంతో భావించుకొని హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి కూర్చోవాలి అంతే.
4.      మనస్సు విషయాల మీదకు వెళ్ళినప్పుడు దానిని మరల్చి మరల దివ్య జ్యోతి మీద ఏకాగ్రత పెట్టాలి అంతే కాని ఏవో మంత్రాలూ అవి ఇవి ఏమి అవసరం లేదు.
5.      ఇట్లా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మరియు రాత్రి మూడు సార్లు సాధన చేస్తే తొందరగా సమాధి స్థితికి వెళ్ళవచ్చు. ఒకసారి సమాధి స్థితికి వెళితే  నీ మనస్సుకు సంపూర్ణత ప్రశాంతత మరియు శ్రద్ధ పెరుగుతుంది అప్పుడు మనస్సు విషయ వాంచనల మీదకు మరలదు.

ధ్యానం చేసుకునే పద్దతులు చాలానే వున్నాయి. అందులో
1. శ్వాశ మీద ధ్యాస(ఇది pyramid ధ్యాన కేంద్రం వాళ్ళు చేపిస్తున్నది)
2. మనస్సులో దివ్య జ్యోతి వుందని భావించుకొని హృదయ స్పందన మీద ఏకాగ్రతను నిలుపడం (ఇది రామకృష్ణ మిషన్ ధ్యాన కేంద్రం వాళ్ళు చేపిస్తున్నది).
౩. ఏకాగ్రతగల మనస్సుతో తననాసికాగ్రభాగమునందే (రెండు కనుబొమల మధ్య భ్రుటి ) దృష్టిని నిలిపి  అంతఃకరణశుద్దికై యోగాభ్యసమును సాధనచేయవలెను భగవద్గీత మరియు ఏకాగ్రతతో మనసు నిలిపి భ్రూ మధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా వీరబ్రహ్మేంద్ర స్వామి .

ధ్యానం చేయడానికి దాదాపు అందరూ ఈ మూడు పద్ధతులనే అవలంబిస్తుంటారు.ఇంకా చాలానే వున్నాయి. వాటి అన్నిటిలో కంటే ఈ మూడు బాగా ఉంటాయి. ఈ మూడింటిలో కూడా మొదటిదాని కంటే రెండవది మేలు. రెండవదాని కంటే మూడవది మేలు. కాని మూడవది మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా వుంటుంది. రెండవది అయితే ధ్యానం చేయడానికి చాల చాల అనువుగా వుంటుంది. తొందరగా మనస్సు కుదుట పడుతుంది . తొందరగా సమాధి స్థితికి వెళ్ళవచ్చు. ఒకటవ దానితో పోలిస్తే రెండవది మేలు. కావున నా ఉద్దేశ్యం మీరు అందరూ రెండవ దానిని అవలంబింది సాధన చేయడం మొదలుపెట్టండి. ధ్యానం చేసుకునే ముందు ఈ విదంగా మనసులో అనుకొని కూర్చోండి.
ఓ పరమాత్మా!
ఈ మనవ జీవితపు యదార్థ లక్ష్యము నీవే ; మేమింకను కోరికలకు బానిసలమై వుండుట వలన ; మా ప్రగతికి ప్రతిబంధకములై వున్నవి ; మమ్ములను ఆ దశకు చేర్చే ; ఏకైక శక్తివి, స్వామివి  నీవే. 
 (ఇది రామకృష్ణ మిషన్ ధ్యాన కేంద్రం వాళ్ళది).

*అయితే ఇప్పుడు జ్ఞానవైరాగ్యాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఏమిటో నేను ఇంతకూ ముందే వివరించాను. వైరాగ్యం అంటే అనిత్యమైన వాటి మీద ఒక అసహ్యాన్ని మనసుకు కలుగ జేస్తూ మనసు మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు ద్రుష్టి నిలిపేలా చేయాలి. ఈ విధంగా మనస్సును జ్ఞాన వైరాగ్యాల ద్వార అదుపు చేయవచ్చు. 

Tuesday, December 3, 2013

భగవద్గీత (ఘంటశాల) :

ఓం నమో పరమాత్మయే నమః

పద్మశ్రీ ఘంటశాల గారు ఆలపించిన భగవద్గీత
1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను.
యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.
2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా...
౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.
4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యేట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.
5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.
6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది.
7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము.
9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.
10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పాయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాణి యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.   
12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.
13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.    
15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.
16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.
17. అర్జునా! నీ వోనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము.
18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.
20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.
21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు.
23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును.
25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
26. కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది.
27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడదు.
28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును.
29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు.
౩౦. దేహత్యాగామునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును.
31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును.
32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగాను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.
౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు.
౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము.
35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.
౩6. సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, అన్ని భూతములయందును చూచుచుండును.
37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.
39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు.
40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.
41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది.
42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఏళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.
43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.
44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు.
45. జ్ఞానసంపంనుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు.
46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.
47. అర్జునా! ఎవడు అభ్యాసయోగాముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు.
48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.
49. జగత్తునందు శుక్లకృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.
5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.
51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను.
52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను.
53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు.
55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును.
56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు.
57. సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను.
58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.
59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తెజోభాగము వలననే సంభవములు.
61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము.
62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము.
6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్ననూ బ్రతుకగల వారిందెవ్వరును లేరు.
64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము.
65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా...
66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.
67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
68. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది.
69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
7౦. శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.
72. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గాములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
7౩. ప్రకృతిని మాయ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను.
75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యును. కర్మలనాచారించువాడు కాడు.
76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఏళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు.
77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను.
78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్లా చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.
79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది.
8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది.
81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.
82. మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.
84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాద్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
85. దేహులందు జటరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.
87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశామును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.
88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.
89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.
9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు.
91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.
92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.
9౩. కర్మములు- ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.
94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.
95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.       
96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.      
97. ఎవడు పరమొత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.
98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?
99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.  
100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.