My Blog List

My Blog List

Tuesday, January 28, 2014

దేహమే దేవాలయం ఎలా ? :


ఓం నమో పరమాత్మయే నమః 

ఓ మిత్రులారా! మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకోని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు . అతని దర్శనం.
నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవశరీరం. ఇక్కడ తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. దేవాలయ ప్రాచీనత :
భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడనీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.
దేహమే దేవాలయంఅవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు.  
నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు.
మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వార మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్న లింగాన్ని దర్శించడం అంటే మనం మన హ్రుదయాన్తరంలో వున్న ఆ సర్వేస్వరున్ని ధ్యానం ద్వార పరిపూర్ణ (సంపూర్ణ) దర్సనం చేసుకోవాలి అని ఆ 
విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన పెద్దలు అలోచించి అలా చేయవలసి వచ్చింది.

మానవుని హృదయం అంటే ఏది ?

ఓం నమో పరమాత్మయే నమః 

మానవుడు సత్వగుణంతో జీవిస్తున్నప్పుడు, మంచి నడవడిక కలిగి, నీతినియమాలతో అంచరిస్తున్నప్పుడు, అతడు ప్రదర్శిస్తున్న కరుణ, దయ, జాలి, ప్రేమ, త్యాగం, ఆనందం, తృప్తి వంటి గుణాలతో అలరారుతున్నప్పుడు అతని మనస్సు ఉన్న స్థితినే హృదయం అంటారు. ఆ విధంగా హృదయం అంటే మానవుని శుద్దమైన మనస్సే కాని అతనిలో రక్త ప్రసారం కావించే గుందేకాయ కాదు. ఆత్మానుభూతిని కలిగించే స్థానాన్నే హృదయం అంటున్నారు. అది రెండు కన్నుల మధ్య మూడవ నేత్రం ఉండే స్థానం వద్ద ఉంది. మూడవ నేత్రం ఉండే స్థానాన్నే ఆజ్ఞాచక్రం అని అంటారు.  సామాన్య మానవుల మనస్సు విషయవాంఛనలతో కూడి ఉండడం వలన వారి హృదయం లోకవాంచలతో కూడి అజ్ఞానంతో సంచరిస్తూ ఉంటుంది. అదే సాధకుని మనస్సు లౌకిక ప్రవృత్తికి మరలి, ధార్మికతతో, నైర్మల్యంతో గడుపుతున్నప్పుడు వారి హృదయం ఆత్మ జ్ఞానంతో సంచరిస్తూ ఉంటుంది. అటువంటి ఉన్నత స్థానం నుంచి సాధకునికి జ్ఞానమనే(పరమాత్మా) సూర్యుడు ప్రకాశిస్తే అతనికి అజ్ఞానమనే చీకటి సంపూర్ణంగా తొలగిపోతుంది. 

దేవుడు ఎవరు ? ఎలా ఉంటాడు (ఆకారుడా లేక నిరాకారుడా) ?

ఓం నమో పరమాత్మయే నమః 

దేవుడు అంటే English లో GOD అని అంటారు. G – Generator – సృష్టించేవాడు, O – Operator పరిపాలించేవాడు, D – Destroyer – నాశనం చేసేవాడు (లయించేవాడు). సృష్టించేవాడు బ్రహ్మ అని, పరిపాలించేవాడు విష్ణువు అని మరియు లయించేవాడు ఈశ్వరుడు అని మన పురాణాలు మనకు తెలిపాయి. ఈ మూడు కూడ ఒకరినుండే జరుగుతున్నాయి. ఒకరే ఈ మూడుగా మారాడు. ఒకటి (శక్తి) మూడు అయింది. అయిన మూడులో ఒకరు అయిన బ్రహ్మ ఆ శక్తినుండే పంచభూతాలను (అగ్ని, నీరు, గాలి, ఆకాశం మరియు భూమి) సృష్టించాడు. కనిపించే ఈ సమస్తమైన నశ్వర (నశించే) ప్రకుతి అంతా ఈ పంచభూతాలనుండే వచ్చింది. అదేవిధంగా మనకు కనిపించే ఈ చరాచర జీవజాలం (మనుషులు, పక్షులు మరియు  జంతువులు) అంతయు పంచభూతాల ద్వారానే తయారయ్యాయి. మన కండ్లకు కనిపించని ఆ శక్తే భగవంతుడయ్యాడు. ఆ భగవంతుడు సృష్టి స్తితి, కర్త మరియు లయగా మారినపుడు ఒక సూక్ష్మ రూప శరీర ధారి అయ్యాడు. ఆ సూక్ష్మ రూప శరీర ధారులైన వారిని దేవతలు అంటాము. అదేలాగు కనిపించే ఈ పంచభూతాలకు, అంతరిక్షంలోని గ్రహాలకు మరియు సూర్య, చంద్రాది మరియు నక్షత్ర్రాలకు అధిపతులు కూడ సూక్ష్మ శరీర రూప ధారులుగా ఉన్నారు. వారినే దేవతలు అంటారు.
ఇదే విషయాన్ని ఐతరేయోపనిషత్తులో వివరించారు, “సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడు మాత్రమె ఉన్నాడు. వేరొకటి అంటూ ఏదియును లేదు. లోకాలను సృష్టించాలి అని అనుకున్నాడు. సృష్టించాడు” మరియు ““మహాచైతన్య పదార్థమైన పరమాత్మే సృష్టికర్తగాను, దేవతలగాను(పంచ భూతాల అధిపతులగాను), ప్రకృతిగను (భూమి, ఆకాశం, గాలి, అగ్ని మరియు జలము) అనే ఐదు మౌలిక మూలకాలుగాను అదే ఉన్నది. సమస్త ప్రాణి కోటి మరియు సమస్త జీవరాసులు కూడా ఆ ఆత్మనే అయి వుంది. స్థావర జంగామాలు అన్నీ ఆత్మే. సమస్తం ఆత్మ మార్గదర్శకంలో నడుచుకుంటున్నాయి. అన్ని ఆత్మలోనే నెలకొనివున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించ బడుతోంది. సమస్తానికి ఆత్మే ఆధారం. మహాచైతన్య పదార్థమైన ఆత్మే బ్రహ్మ. 
అయితే జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ పిలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.
ఆ భగవంతుడిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారు. ఆ భగవంతుడిని వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో మరియు భగవద్గీతలో పరమాత్మా అని. ఖురాన్ లో అల్లాహ్ అని. బైబిల్ లో యోహోవా అని పిలిచారు. ఒక్కొక్కరు ఒక్కొక్కల పిలిచారు. కాని అన్నియు పేర్లు ఆ భగవంతుడివే. అన్నీ ఆయనే.
మన కండ్లకు కనిపించే ప్రతి ఒక్క జీవికి (మనుషులు, పక్షులు మరియు జంతువులు) భగవంతుడు ఒక్కడే. అదేవిధంగా  మన కండ్లకు కనిపించని దేవతలకు (అంటే పంచభూతాల, గ్రహాల అధిపతులకు) కూడ అధిపతి ఆ భగవంతుడే. ఆ భగవంతుడు నిరాకారుడు (ఆకారములేనివాడు).
భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు. అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. అది లేకుండా ఏదియును లేదు, ఉండదు. అదియే ఈ కనిపించే ఈ సమస్త సృష్టి కూడ అయి ఉంది.

ఒకసారి ఇక్కడ కొన్ని వాక్యాలను పరిశీలిద్దాం.
భగవద్గీత :
-          ఈ సృష్టి కార్యమునకు నేనే కర్తనైనను, శాస్వతుడను, పరమేశ్వరుడను అయినను నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము.  (4:13)
-          ఓ మహోబాహొ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని నా ప్రక్రుతి ఎనిమిది విధములుగా కలదు. ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రక్కృతి అని అందురు. (7:4)
-          ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి అని తెలిసికొనుము. (7:5)
-          ఓ అర్జునా! సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతులనుండియే పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు వినాశనము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే కారకుడను. (7:6)
-          అనేకవిధములైన భోగవాంఛలలో కూరుకొనిపొయినవారి జ్ఞానం అంతరించిపోవుచు. వారు తమతమ స్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించురు. (7:20)
-          అల్పబుద్దులగు భక్తులు పొందేది ఫలములు గూడా అల్పములే. ఇతర దేవతలను పుజించువారు ఆ దేవతలనే చేరుదురు. ఎవరైతే నా స్వస్వరుపాన్ని(పరమాత్మను) గ్రహించి వారి మనసు నా యందు లగ్నం చేస్తారో వారు నన్నే పొందుచున్నారు. (7:23)
-          పరమాత్మస్వరూపుడును(నిరాకారుడను) అయిన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు, నిష్కామ భావముతో కర్మలను చేయుచు (అంటే కర్మఫలాన్ని భగవదర్పితం చేయుచు) సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (9:22)
-          దేవతలను పూజించువారు దేవలోకమును చేరుదురు. పితరులను సేవించువారు పిత్రులోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను నిరాకారుడిగా తలచి  నిరంతరము ధ్యానించు, ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. (9:25)
-          వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మనుండియే విస్తరించుచున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు. (13:౩౦)
-          అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్లా చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.

Wednesday, January 15, 2014

సాయిబాబా దివ్యవాణి :


ఓం నమో పరమాత్మయే నమః 

బాబా ఒకసారి భక్తులతో ఇలా అన్నారు :
మీరెక్కడ నున్నప్పటికి, ఏమిచేసినప్పటికి నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమందు చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సుత్రదారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియచాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే. ఎవరైతే తమ ద్రుష్టి నావైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగాని, బాధగాని కలుగదు. ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.
బాబా తనభక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను :
నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తిశ్రద్దలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూచెదను.
సాయి రామ్, రహీమ్ కూడ అని అల్లా ఆయనే. దేవుడు ఆయనే, అనంతుడు ఆయనే. కబిరే నా మతం, భగవంతుడే నా కులం అని అన్నారు.  
నేననగా ఎవరు? అని సాయిబాబా ఎన్నో సార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు. నన్ను వెదకుటకు నీవు దూరముగాని, మరెచ్చటకుగాని వెళ్లనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలో, చైతన్యము లేదా అంతరాత్మ కలదని అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్నింటిలోను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకాత్వమనుభవించి నాలో ఐక్యము పొందెదవు.
దైవ సాక్షాత్కారానికి సాయిబాబా చెప్పిన పది సూత్రాలు :
1. ఈ లోకం క్షుద్రమైనదని తెలిసి ఇహపర సుఖాల మీద మమకారం వదులుకోవాలి.
2.
బంధ విముక్తికి నిరంతరం పాటుపడాలి.
3.
ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు అంతర్ముఖుడు కావాలి.
4.
జ్ఞానం సంపాదించిన, దుశ్చర్యలు మానకపోతే శాంతిలేదు.
5.
సత్యం, తపస్సు, అంతర్ముఖం, సదాచారం సాధకుడికి అవసరం.
6.
వివేకవంతుడు శ్రేయస్సు, గొప్పతనాన్ని గ్రహించాలి.
7.
ఇంద్రియ నిగ్రహం లేకపోతే గమ్యం చేరలేడు.
8.
మనస్సు నిష్కామనగా, నిర్మలంగా ఉండాలి.
9.
సద్గురువును ఆశ్రయించి జ్ఞానం పొందాలి. ఆత్మ నిగ్రహం అలవరచుకోవాలి.
10.
అన్నిటికంటే భగవనుగ్రహం ముఖ్యం. నిరాశలో, నిశ్ప్రుహలో అది ఆశాకిరణం

Tuesday, January 14, 2014

మనోబుద్దులు అంటే ఏంటివి? వాటి పని ఏమి?


ఓం నమో పరమాత్మయే నమః 

శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడ పనిచెయ్యలేదు. ఆత్మ యొక్క శక్తి ద్వారానే ఇంద్రియాలన్ని జీవుని ద్వార నడుస్తున్నాయి. మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆ జీవుడు నేను నాది అనే అహంకారంతో అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది. మనోబుద్దులు శరీరం లోపల పని చేస్తూ ఉంటాయి, అవి నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి
1.      మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకల్లోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.
2.      బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.
3.      అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే అహంకారం అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.
4.      చిత్తం: చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.
అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం  తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.         

నిరంతరం భగవంతుణ్ణి ఎందుకు స్మరించాలి?


ఓం నమో పరమాత్మయే నమః

మిత్రులారా! మనం ఏదైనా ఒక చెట్టు నాటాలనుకున్నామనుకో, మొదట ఏ చెట్టు నాటాలి అని Decide చేసుకుంటాము. ఆ తరువాత దాని విత్తనం తెచ్చి భూమిలో నాటి, దానికి ప్రతి రోజు నీళ్ళు పోస్తూ ఉంటూ, దానిని ఏ పశువులు చెట్టును తగలకుండా చెట్టు చుట్టూ కంచె వేస్తాము. అప్పుడు అది కొన్నాళ్ళకు పెద్దదై మనకు ఫలాలను మరియు నీడను ఇస్తుంది. అదేలాగు ఇక్కడ మనం భగవంతునిని తెలుసుకోవాలంటే, మొదట మనం జ్ఞానం ద్వార నేను ఆత్మను మరియు ఈ సమస్తము(కనిపించే సృష్టి అంటే ప్రకృతి మొత్తం) పరమాత్ముడే ఈ విధంగా అయ్యాడు, ఈ కనిపించే ప్రకృతి అంతా తిరిగి నశించి మరల ఆ పరమాత్ముడిగా (అంటే శక్తిగా) మారుతుంది అని తెలుసుకుంటాము. కాని ఇది తెలిసినంత ఆ క్షణమే మనకు సంపూర్ణంగా తెలిసినట్లు కాదు. నిజమైన స్వస్వరూపమైన ఆ దివ్య శక్తిని నీ శరీరపు హృదయంలో ఎప్పుడు దర్శించుతావో, అప్పుడు నీవు పరిపూర్ణుడవు అవుతావు.
ఆ విధంగా పరిపూర్ణతను సాధించాలంటే నీవు నిరంతరం ఆ పరమాత్మునిని స్మరిస్తూ వుంటూ, చేసే ప్రతి పనిని దైవారధనగా భావిస్తూ, భగవంతార్పణ బుద్దితో అన్ని పనులు చేస్తూ ఉంటే, అప్పుడు నీ మనస్సు నిర్మలమవుతుంది. నీ మనస్సు నిర్మలమైన కొలది నీకు ఆ భగవంతుని తత్త్వం నీకు సంపూర్ణంగా అర్ధమవుతూ ఉంటుంది. నీకు ఆయన తత్త్వం అర్ధమయ్యే కొద్దీ నీ హృదయంలో ఆయనను దర్శించాలనే తపన అధికమవుతుంది. అప్పుడు నీకు ధ్యానంలో నీ మనస్సు శుద్దమైన పరమాత్మవైపే పరుగులు పెడుతుంది.
ఇక్కడ చెట్టు ఉదాహరణ గురించి చెపుతా...మనలక్ష్య సాధన మోక్షం (ఏ చెట్టు నాటాలో) అంటే హృదయంలో భగవంతుని సాక్షాత్కారం. అప్పుడు మనం భగవంతునిని హృదయంలో దర్శించాలి అని మన మనస్సులో దానిని స్థిరపరచాలి (విత్తును భూమిలో నాటడం). మనస్సులో స్థిరపరచిన తరువాత, ప్రతి క్షణం నిరంతరం ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఉండాలి (ప్రతి రోజు చెట్టుకు నీరు పోస్తూవుండడం). నిరంతరం స్మరిస్తూ మరియు చేసే ప్రతి పనిని భాగంతార్పణ బుద్దితో చేస్తూ ఉండాలి, అప్పుడు జరిగిపోయే ఈ ఆగామి కర్మలకు మనం బద్దులం కాము (చెట్టును తాకకుండా దాని చుట్టూ కంచే వేసినట్లు, మనకు ఆ కర్మలు తాకకుండా ఉండేందుకు భగవంతార్పణ బుద్దితో కర్మలు చేయడం).
ఈ విధంగా మనం ప్రతి రోజు నిరంతరం భగవంతునిని స్మరిస్తూ ఉంటూ మరియు ఆన్ని పనులు భగవంతార్పణ బుద్దితో చేసుకుంటూ పోతు ఉంటే, అప్పుడు మన మనస్సు తొందరగా నిర్మలమవుతుంది, శుద్దమవుతుంది, ఆ విధంగా పరిపూర్ణమైనపుడు, మనం ఆ దేవదేవుడిని హృదయంలో తొందరగా దర్శించుకోవచ్చు. 

తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?

ఓం నమో పరమాత్మయే నమః

తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే తపస్సు అంటారు. మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తోలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి.
ప్రతి మానవుడు తానూ జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణంను పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడ అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. మొదట తానూ మారాలి? ఎందుకు? ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకున్నాము మరియు జీవిత లక్ష్యము తెలుసుకున్నాము, అదియే మోక్షము. ఆ మోక్ష సాధన కోసం మారాలి. మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు ,ఉద్దేశించాడు) ఏర్పరచినాడు. మానవుడు దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి. 
మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని అత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం. ఆత్మానుభూతి, ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్లవాల్లకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై అత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం నిరంతరం ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.         

నేను ఎవరు? శరీరమా లేక ఆత్మనా?


ఓం నమో పరమాత్మయే నమః 

నేను ఎవరు? అనే పదాన్ని కూడ ఉచ్చరించే స్థితిలో లేదు నేటి సమాజం. అంతగా మనుష్యులందరూ వారి వారి పనులతో మరియు సమస్యలతో సతమతమవుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటిది వారు నేను ఎవరు? శరీరమా లేక ఆత్మనా అని తెలుసుకొనేంత సమయం ఎక్కడ ఉంటుంది. కాని వారికి ఎన్ని పనులున్నా మరియు ఎన్ని సమస్యలున్నా, మనసు మాత్రం తన పని తానూ చేసుకుంటూ వెళుతుంది. అది ప్రతి రోజు గుర్తు చేస్తూ ఉంటుంది. దానిని మనం లెక్కచేయం, ఎందుకంటే అది మనకు గుర్తు చేసిన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏమి చేయాలో, ఎలా ముందుకు అడుగు వేయాలో మనకు తెలియదు కనుక. పోనీలే ఎప్పుడైనా మనకు తెలుసుకొవాల అని ఎవరినైనా అడుగుదాము అంటే వారికి తెలియదు. పోనీలే అని వారి వారి మత గ్రంధాలు చెదివి తెలుసుకుందాము అనుకుంటే అది సరిగా అర్ధం కాదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలో తెలియక మరల మన మన పనులలో మనం నిమగ్నమై దానిని వదిలేస్తున్నాం.

నీవు ఎవరు అన్న విషయాన్ని మరియు దేవుడు ఎవరు అన్న జ్ఞానాన్ని తెలుపడానికి ఈ భూమి మీదకు వచ్చిన పరమాత్మా స్వరూపులు అయిన సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధనలు చేసినపుడు వారిని దేవుడు అని అంటాము, కాని వారు బోధించిన జ్ఞానాన్ని మాత్రం అంతగా పట్టించుకోము. పైగా అప్పుడు కూడ మనం మన అల్పమైన కోరికలను కోరుకొని వారిని కూడ ఇబ్బంది పెడతాము. వారు మన దౌర్భాగ్య పరిస్థితిని చూసి ఎట్లా వీళ్ళకు నచ్చచేప్పేది అని మదనపడ్డారు. ఇదే విషయాన్ని సాయిబాబా స్వయంగా తన భక్తులతో ఇలా చెప్పాడు. నా దగ్గర చాల జ్ఞాన సంపద ఉంది మరియు నేను మీకు అందరికి బంగారు వస్త్రాలు ఇద్దాము అని అనుకుంటే, మీరు మాత్రం నా దగ్గరికి వచ్చి చినిగిపొయిన పాత వస్త్రాలను అడుగుతున్నారు మరియు మరీ అల్పమైన కోరికలను కోరితే, నేను ఏమి చేసేది. అని అయన భక్తులతో చెప్పి ఎంతగానో మదనపడ్డాడట.

కాని ఇక్కడ తెలుసుకుందాం. నేను ఎవరు? నేను శరీరం అని అనుకుందాం. నేను శరీరం అని అనుకుంటే మనకు మొదటగా వచ్చ్చే జ్ఞాపకం మన పేరు. అది ఏదైనా కావచ్చు. సరే, మనం శరీరం అనుకుంటే ఇలానే శాశ్వతంగా శరీరంతోనే ఉంటామా అంటే, లేదు అని మొదటగా మన మనసు మనకు జవాబు చెప్పేస్తుంది. అప్పుడు మనకు అవును మరీ నిజమే కదా, మన పూర్వీకులు ఎవరు ఇప్పుడు లేరు. వారు అంతా చనిపోయారు కదా! అంతేకాక ఈ శరీరం శాశ్వతంగా ఉండాలని ఎన్నో తపస్సులు చేసి మరియు ఎన్నో వరాలు పొందిన రాక్షషులు కూడ చివరకు నాశనమయ్యారు (అంటే ఈ శరీరాన్ని విడిచారు) కదా అని మనకు గుర్తు వస్తుంది. అయితే నేను ఈ శరీరం కాదు అయితే మరి నేను ఎవరు? అనేది ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం ?
ఈ శరీరం నువ్వు కాదు అనే విషయాన్ని తెలుపడానికే శ్రీ షిరిడి సాయిబాబా వారు తన భక్తులకు ఒకసారి ఈ విధముగా చేసి చూపాడు. అది ఏమిటంటే, బాబా ఒకసారి తన భక్తులతో నేను ఈ శరీరం వదలి వెళ్లి, మూడు రోజుల తరువాత తిరిగి వస్తాను అని చెప్తాడు. రెండు రోజుల తరువాత భక్తులు ఏమిచేయాలో పాలుపోక సతమతమవుతూ వుంటారు. అప్పుడు ఆ ఊరి పెద్ద, వేరే పట్టణం నుండి వైద్యున్ని పిలుచుకొని వచ్చి శవానికి పరీక్ష చేయిస్తాడు. అప్పుడు ఆ వైద్యుడు, ఇతడు చనిపోయాడు, బ్రతికే chance లేదు అని చెప్తాడు. అపుడు ఆ ఊరి పెద్ద దహన సంస్కారాలు చేయండి అని చెప్తాడు. కాని ఊరి వారి అందరి బలవంతం కారణంగా వారు మూడు రోజుల తరువాత బాబా వస్తాను అని చెప్పాడు, మూడు రోజుల తరువాత చేద్దాం అని అంటారు. అప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. బాబా మూడు రోజుల తరువాత మరల తన శరీరం లోకి వస్తాడు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. చూసారా, సాయిబాబా ఎంత గొప్ప ప్రయోగం చేసాడో. దేనికి ఇది అంతా ఈ విధంగా చేయవలసి వచ్చిందంటే, ఈ శరీరాలు మీరు కాదు అని చెప్పడానికి ఆ మహానుభావుడు ఆ విధంగా practical గా చేసి చూపించాడు. ఎందుకంటే theoretical గా చెప్తుంటే అర్ధం చేసుకోలేకపోతున్నారు అని ఆయన ఆ విధంగా చేశాడు.  
సరే నేను ఈ శరీరం కాదు అన్నప్పుడు, నేను వేరే ఏదైనా ఉండి ఉండాలి. అంతే కదా! ఆ నేను ఎవరు? అనేది మనం తెలుసుకుకోవాలి. దేన్నయితే మనస్సు గ్రహించలేదో అయినప్పటికీ, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో, దేన్నయితే కళ్ళు చూడలేవో అయినప్పటికీ దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో, దేన్నయితే చెవులు వినలేవో అయినప్పటికీ దేనిచేత చెవులు వినేశక్తి పొందగాలుగుతున్నాయో, దేన్నయితే ముక్కు వాసన చూడలేదో అయినప్పటికీ దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో ,అదే ఆత్మ స్వరూపం అని కేనోపనిషత్తులో సవివరంగా వివరించారు. అంటే మన శరీరం, మనస్సు మరియు బుద్ధి అన్నియు ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి (ఆత్మ) మాత్రమె శాశ్వతం, అదియే నీవు. ఈ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది. అప్పుడు శరీరంలోనివి ఏవి కూడ పనిచేయవు.  
మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు. ఆత్మ రాజయినప్పటికీ సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ అహంకారంతో ప్రవర్తించటం జరుగుతుంది. మనస్సనే మంత్రి రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి ఆత్మే నేను (అనే జ్ఞానాన్ని తెలుసుకొని) అంటే రాజే నేను అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకొని పనిచేసుకుంటూ వెళ్ళినపుడు మంత్రి ఏమి చెయ్యలేదు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన మనస్సు ఆత్మలో లయించవలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి నేనే ఆత్మను (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేలతామో అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది. 

Sunday, January 12, 2014

ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది?


ఓం నమో పరమాత్మయే నమః 

ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో 99% మందికి తెలియదు. దాదాపు చాలా మందికి ఆత్మ అంటే తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తొకలను తగిలిచ్చి నిజమైన ఆత్మ స్వరూపాన్ని ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు. తెలియకపోతే తెలియనట్లుండాలి, అంతే కాని ఎవడో ఒక తెలివితక్కువ వెధవ వాడికి తెలిసిన ఒక అజ్ఞాన మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సబబుకాదు.ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని, పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు. అజ్ఞానులైతే, వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులల్లో భయాలు కలిగినప్పుడు, అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు, కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం. మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేదవేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన, అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు ఎవరో ఒక మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును.ఆ విన్నవారిలో, చూచినవరిలో, చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా యెరుగరు.(2:29)

సరే కాని, నిజానికి ఆత్మ అంటే దైవమా? లేక దయ్యమా? ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది, ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు, కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు confuse అవడమే కాక అందరిని confusion లోకి నెట్టేస్తున్నారు.

ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమె అది ఏమిటో దాని తత్వమూ ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించేవాల్లకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని, చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని, చాల శాస్త్రాల అధ్యయనం చేయడంవలనగాని, ఎన్నో గుడార్థాలు మహాత్ములవద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. ఆత్మ మనోబలం లేనివారికి, అజాగ్రత్తపరులకు, శాస్త్రవిరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.

ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం.
భగవద్గీత : శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు.          
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జననమరనములు లేనిదనియు, మార్పులేనిదనియు, శాశ్వతమైనది, సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది, స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది. (2:19-25)

ఉపనిషతులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.
జ్యోతిస్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువుకంటే సూక్ష్మం అంతటా వ్యపించినదీ, అత్యంతము సుక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనదీ. అపరిమితమైన జ్యోతిస్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం, అది ఈ శరీరలోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు(చుక్కలు) వెలుగు నీయవు. మెరుపులుకూడ కాంతి నీయవు. ఇక కేవలమైన అగ్ని మాట చెప్పడమెందుకు? స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వళ్ళ మాత్రమే సర్వము కాంతులీనుతుంది! ఈ యావద్విశ్వము కూడఆ ఆత్మజ్యోతి వల్లనే దేదీప్యమానమవుతూ ఉన్నది.
స్వయం ప్రకాశిత,మైన జ్యోతిస్వరూపమైన ఆత్మను మాటలచేత వర్ణింపనలవికాదు, దాన్ని కళ్ళు చూడలేవు. ఇంద్రియాలు గ్రహించలేవు. కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చమైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యానమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.

బైబిల్: ఏసుక్రీస్తు తన వాక్యాలలో ఈ ఆత్మ విషయమై ఈ విధంగా బోధించినాడు.
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. (మత్తయి సువార్త : 5:౩). అదేవిధంగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. (మత్తయి సువార్త : 5:48)

ఆత్మ అంటే ఒక శక్తి (మనం అర్ధం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపినారు). అటువంటి శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది తప్ప దయ్యము మాత్రము కాదు అని గ్రహించి మరియు సంపుర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి, అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని, దేదీప్యమానంగా స్వయంప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే దర్శించి, నిన్ను నువ్వుగా తెలుసుకొని, మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం చేసుకుందాం.    

Wednesday, January 8, 2014

ఏకాగ్రతా రహస్యం :


ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు. కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. ఎవరు ఏ పని చేస్తున్న ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది, అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివ్రుత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం. కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు. దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది.

భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నకు సైతం భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పిన సమాధానం :
అర్జునుడు : కృష్ణా! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ! దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బందించడం లాంటిదే! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడం ఎలా?
శ్రీకృష్ణుడు : అర్జునా! నువ్వు చెబుతున్నది నిజమే. మనస్సు చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంతా సులభమైన పని కాదన్నది నిజమే! అయితే అంతటి చంచలమైన మనసును సైతం నిరంతర సాధన ,అంటీ ముట్టని ధోరణి అనే బలం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చన్నది అంతే నిజం.

మనస్సును నియంత్రణలోకి తీసుకురావడానికి అన్నిటికన్నా ముఖ్యంగా, మొట్టమొదట ఓ విషయం తెలుసుకోవాలి. తాము పోరాడదలచిన మనస్సు స్వభావాన్ని స్పష్టంగా అర్ధం చేసికోవాలి. మనస్సనేది కోతి లాగ చంచలమైనది. తప్పతాగి మత్తెక్కిన ఏనుగు లాగ చాల బలమైనది. అలాంటి మనసును నియంత్రించడమనేది అర్జునుడు చెప్పినట్లుగా, గాలిని పట్టుకోవడం లాంటిదే! కోతులను పట్టుకోవడంలోను, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం లోను ఎలాంటి నైపుణ్యం అవసరమో అంతా నేర్పు మనస్సును క్రమబద్దీకరించడానికి కావాలి.

భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరునకు వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం ఇదీ మనస్సు స్వభావం. ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో దమం అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే శమం అంటారు.

మనస్సు గురించి, దాని ఏకాగ్రత గురించి ఎన్నో వివరాలు తెలిసిన తరువాత, అసలింతకీ, మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి? అని కొందరు అడుగవచ్చు. దీనికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. దానికి సరైన జవాబు ఒక్కటే: మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనస్సుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది.

కొందరు కొన్ని సందర్భాలలో, మరికొందరు తమ జీవిత పర్యంతము దుర్భల మనష్కులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారి మానసిక శక్తులన్నీ విచక్షణారహితంగా వేర్వేరు అంశాలపైన చెల్లచెదురై పోవడం వలన వారు అలా దుర్భల మనష్కులుగా కనిపిస్తుంటారు. అగ్నిని సృష్టించే శక్తి సూర్యకిరణాలకు ఉందని అందరికీ తెలియదు. వాళ్ళకు ఎందుకు తెలియదంటారా? సూర్యకిరణాలు నిప్పును పుట్టిస్తూ, వస్తువులను కాల్చి వేస్తుండడం వారు చూసి ఉండకపోవచ్చు! కానీ అవే సూర్యకిరణాలను ఓ కుంభాకార దర్పణం గుండా పోనిచ్చి, ఓ కాగితం ముక్క మీద పడేలా చేస్తే ,వారే ఆ కాగితాన్ని కాల్చవచ్చు. మరి , ఆ కిరాణాలకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? ఆ కిరాణాలను ఏక బిందుముఖంగా సాగేల చేసి, ఆ రకంగా వాటిని ఎకాగ్రపరచడం వలన కలిగిన ఫలితమే ఆ కాగితం కాలడం! అంతకు ముందు, ఆ కిరణాలు వివిధ దిశల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. దాంతో, ఉష్ణాన్ని పుట్టించే శక్తి వాటికి ఉన్నప్పటికీ, అవి వేటిని కాల్చలేకపోయాయి. కానీ, వాటిని ఎకాగ్రపరచిన వెంటనే ప్రకాశవంతమైన నిప్పును పుట్టించాయి. ఈ రహస్యం మనం గ్రహించాలి.
ఇదే రకంగా, మన మనస్సుల్లో సహజసిద్దంగానే అసాధారణమైన శక్తి ఉంటుంది. అయితే, అవసరమైన, అవసరం లేని అన్ని రకాలైన అంశాల మీద ఈ శక్తిని మనం ఖర్చు చేస్తున్నాం. అందువల్లే మనం అత్యంత సాధారణమైన పనులు తప్ప మిగిలినవేవి చేయలేకపోతున్నాం. ఘనకార్యాలు సాధించాలంటే, చెల్లా చెదురుగా ఉన్న మానసిక శక్తులన్నిటిని క్రమబద్దీకరించాలి. మన మనస్సులు స్వాధీనంలో ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం.

ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది.

స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం.

సరే! మనస్సును ఏకాగ్రపరచాలన్న మాట నిజమే? కానీ, దాన్నీ ఏ వస్తువు మీద ఏకాగ్రపరచాలి? మనం అందరం యోగులం అవడానికి ప్రయత్నిస్తున్నాం కావున, మనం అందరం స్వయం ప్రకాశితమైన మన ఆత్మజ్యోతి మీద మన మనస్సును ఏకాగ్రపరచాలి.


మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.      

ఓం నమో పరమాత్మయే నమః