My Blog List

My Blog List

Thursday, April 3, 2014

కపిల వాసుదేవుడు తన తల్లి అయిన దేవహుతికి బ్రహ్మ విద్యను (ఆత్మ జ్ఞానాన్ని) బోధించుట:

శ్రీ మహా విష్ణు మూర్తి సత్య యుగం ప్రారంభమైన తరువాత ఆయన బ్రహ్మ విద్యను ఈ లోకంలోని మానవాళికి తెలుపడానికి తానే కపిలుడుగా ఈ భూమి మీదకు అవతరించాడు. ఆ విధంగా మానవాళికి బ్రహ్మవిద్యను అందించడం కోసం ఆయన కర్ధముడు మరియు దేవహుతి కి కుమారుడుగా జన్మించాడు.
ఆయన పుట్టిన తరువాత కర్దముడు తపస్సు కోసం దేవహుతి ని వదలిపెట్టి అడవులకు వెళతాడు. ఆ తరువాత కపిలుడు పెద్ద వాడైన తరువాత తన తల్లి ద్వార బ్రహ్మవిద్యను ఈ లోకంలోని మానవాళి కోసం వివరించాడు.

తల్లీ! బంధమునకు, మోక్షమునకు మనస్సే కారణము. మనసు త్రిగుణములతో చేరి, ఆ గుణములు సమత్వము తప్పినప్పుడు, అందులో యేదో యొక గుణము తీవ్రమై దానివలన జనించు ఉద్రేకముల యందు ఆత్మ తగుల్కొని యుండును. మనస్సు అంతరాత్మ నుండి దూరమై, ఇంద్రియములకు సంతృప్తి గూర్చు వస్తువులయందు తగులువడి యుండును. ఇంద్రియములకు వస్తు అనుభవమును సమకూర్చుచు, ఆత్మకు దూర దూరముగ జరిగి మనస్సు సంచరించుచుండును. అదే మనస్సును అంతర్ముఖము గావించి, పురుషోత్తముడైన నారాయణునితో అనగా ఈశ్వరునితో చేర్చియున్నప్పుడు, ఇంద్రియ లంపటముల నుండి స్వేచ్ఛను పొందును ఈ మార్గమునకు చిఇత సంయమనమని పేరు గంయమునకు ఇది మొదటి మెట్టు.నేను-నాది అను భావములు అద్రుశ్యమైనపుడు, మనస్సు కామక్రోధములనే దుష్టశక్తుల నుండి స్వేఛ్చ నొంది యుండును. అప్పుడు మనస్సు శుద్దముగా నుండి నన్ను ధ్యానించి చేరుట కర్హమై యుండును. అపుడు ప్రాపంచిక సుఖ దుఃఖములు మనసును అంటవు. భక్తి, జ్ఞాన వైరాగ్యములతో నిండిన మనసు బ్రహ్మమును దర్శించగలదు.



భక్తి మార్గము :
తల్లీ! అన్ని మార్గములలో భక్తి మార్గము అతి సులభమైనది .తప్పక గంయమునకు తీసుకు వెళ్ళగలదు. ఇతర మార్గములు, భక్తి మార్గము తీసుకువెళ్ళునంత త్వరగా, మోక్షమునకు తెసుకెళ్ళలేవు మానవునిలో సంగమనే గుణము అంతర్లీనముగా ఉన్నదనీ ఋషులు చెప్పుదురు. దీనికి నాశము లేదు నిత్యమూ పచ్చగా ఉండి, నాశనము లేని ఈ గుణమును విస్మరించుటకు వీలులేదు. అమ్మా! సంగమనునది యెల్లప్పుడు ఉండును. మోక్షమునకు దీనినొక సాధనముగా వినియోగించు కొనవలెను. సంగము అనగా అనుబంధము ఉండనిమ్ము. కాని బాహ్య వస్తువుల నుండి మరల్చుము ఇంతవరకు నీకు ప్రాపంచిక వస్తువులపై అనుబంధము కలదు. ప్రాపంచిక వస్తువులకు బదులుగా నారాయణునితో అనుబంధము యేర్పరచుకొనుము. అనుబంధము వీడనక్కర్లేదు. నారాయణునితో అనుబంధము బాహ్య వస్తువులతో గల అనుబంధమును త్రెంచును. ఇది సులభముగా చేయవచ్చును.
ఈ అనుబంధము అధముమైన వానినుండి ఉత్తమమైన వానివైపు మల్లించుట క్రమ క్రమముగా జరుగవలెను. ఒక్కసారిగా ఒకదానిని వదలిపెట్టి రెండవదానిని చేబట్టుట సాధ్యము కాదు. అందుకు మనస్సు సహకరించదు. అంతిమ ద్యేయమునకు ముక్త సంగమాని పేరు. ఈ మార్గము ననుసరించుట సాధు సాంగత్యముచే, మనసునకు తగిన శిక్షణ కలుగును సజ్జన సాంగత్యము కలిగిన తర్వాత, మనస్సు వెనుకటి ఆకర్షణలకు లోబడకయుండును. ఇందువలన తరువాత మెట్టు సులభమగును.
భగవంతునిపై ఆలోచనలకూ మనస్సును మళ్ళించుటెట్లు? అనుకున్న దానికన్న తెలికయే. ఇంతకు ముందు అరిషడ్వర్గములైన కామక్రోధములు , నేను-నాది, అను భవములు మనస్సును మాలిన మొనర్చి గమ్యము నుండి మరల్చి, ఇంద్రియములకు తృప్తిని గూర్చు వస్తువులవైపు నడిపించునని తెలిసియున్నాను. అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములచే కల్మషముల బారినుండి స్వేఛ్చ పొందిన మనస్సు సహజముగా భగవంతునివైపు మరలును.
దీనిని సాధించి, ముక్త సంగులైన తర్వాత, సత్సంగము అనగా సజ్జనుల సాంగత్యముతో కాలము గడపవలెను. నిత్యము పచ్చగా ఉండే అనుబంధము సాధువులతో ముడిపడి యుండవలెను. సాధువు లెవరు? వారి లక్షణము లేమిటి ?వారిని గుర్తించుటెట్లు? ఇవి నీకు చెప్పెదను. ఈ భౌతిక శరీరమునకు కలిగే బాధల వలన అనారోగ్యముల వలన సాధువులు తమ మనస్థితిని పోగొట్టుకొనరు. అందరి మానవుల యెడ వారు దయకలిగి యుందురు. అన్ని జావులు వారికి బంధువులే. అన్నీ జీవులను ప్రేమించెదరు అందుచే సహజముగా వారికి శత్రువులుండరు. వారు యెప్పుడు శాంతముగా మరియు వారి మనస్సు యెట్టి కలవరములు లేక ప్రశాంతతో నిండి యుండును. వారు యెప్పుడును ధర్మ మార్గమును విడిచిపెట్టరు. వారి ప్రవర్తన దోషరహితము నన్ను గురించియే వారెప్పుడు తలంచెదరు. వారికి యెటువంటి విధులు, బాధ్యతలు, సంబంధము లేకుండుట చేత, నా గురించి కథలు తెలుసుకొనుట లోను వాటిని ఇతరులకు తెలియజెప్పుట లోను ఆనంద మనుభవించుచుందురు. ఈ ప్రాపంచికమైన బాధలు వారిని బాధించవు. వీటినుండి స్వేచ్ఛను పొందినటువంటి వారినే సాధువులందురు. అమ్మా! ఇట్టి సాధువులతో నీ మనస్సు అనుబంధము కలిగి యుండవలెనని ప్రార్ధింపుము. వారు నీకున్న అనుబంధముల నుండి విముక్తి కలిగించుటకు సహాయపడగలరు.
కపిలుడు చెప్పుచుండగా తల్లి శ్రద్దగా వినుచూ మధ్యలో ఇట్లా అడిగెను.నేను వేదములు చదవలేదు మరి నావంటి అమాయిక స్త్రీ భగవంతుని చేరుటెట్లో తెలియజెప్పుము. భగవంతుని చేరుటకు సులభమైన మార్గమేది?
భక్తీ యని కపిలుడనెను. నీకు భక్తి యోగము ఉపయోగపడును. ప్రాపంచిక వస్తువులందు తగుల్గోనిన ఇంద్రియములు, వేదములు నిర్దేశించిన నిత్యవిదులు, కర్మలు చేయుట యందు నిమగ్నమైన మనస్సు, ఈ రెండు కూడను విముక్తి పొందుటకు ఒకే ఒక మార్గము కలదు. అది తనకు తానుగా శ్రద్ధతో మోక్షమును కాంక్షించుట నారాయణుని యందు అనన్య భక్తి పెంపొందించుకొనినపుడు ఈ కాంక్ష తీరగలదు. ఈ భక్తి కర్మ బంధములను, ఇంద్రియ బంధములను, శరీరములోని అగ్ని (వైశ్వాసరుడు) భుజించిన ఆహారమును దహించినట్లుగా దగ్దము చేయును. భక్తి వస్తు ప్రపంచము నుండి విముక్తిని కల్గించి, నారాయణునితో ఐక్యమగునట్లు చేయును భక్తి మార్గములో పయనించు భక్తులు ముక్తి అనే గమ్యమును సునాయాసముగా చేరగలరు.
నాకు యెప్పుడు సేవచేయుచు, నాతోనే అనుబంధము కలిగియుంటూ, నాకు సంతోషము కలిగించుటకే కర్మలను చేయుచూ, నా కథలనే యెల్లప్పుడు చెప్పుచుండు సాధువులు మోక్షమును సైతం కోరరు నన్ను గురించిన ఆలోచనలతోనే వారు ఆనందముగా నుండెదరు వారు తమ మనో నేత్రముతో నా రూపము నెప్పుడు చూచుచుందురు అందుచే, వారడిగినను లేకున్నను, నేను వారికి ముక్తిని ప్రసాదింతును.
నా భక్తులకు యెట్టి వినాశము కలుగదు నాలో లీనము కానున్న భక్తుల యెడ చక్రము (కాలచక్రము), శక్తిహీనమై యుండును. నేను భక్తులకు సర్వస్వమును పుత్రులపై యెట్టి ప్రేమయో ణ భక్తులపై నాకట్టి ప్రేమ నేను భక్తులకు మిత్రుడను, గురువును, శ్రేయోభిలాషిని, ప్రియతముడను ఈ లోకమంతయు నా ఆధీనములో నుండుటచే నా భక్తులకు యెట్టి భయము ఉండదు. నాకు భయపడి గాలి వీచును, సూర్యుడు ప్రకాశించును, పర్జన్యుడు (వరణుడు) వర్షించును నాచే నియమితుడై అగ్ని దహించును, యనుడు అందరిని కనిపెట్టి యుండును. ఇంద్రియములను జయించిన యోగులకు భయము కలుగదు వారు నన్ను తప్పక చేరెదరు. ఇందు యే మాత్రము సంశయము లేదు.
సాంఖ్య యోగము :
పురుషుని రహస్యమును, అతడు యీ లోకమునంతయు యెట్లు వ్యాపించియున్నది నీకు నేను చెప్పెదను. దీనిని ఆత్మవిధ్యా యోగమందురు. సంపూర్ణముగా దీనిని చక్కగా అర్ధము చేసికొనిన యెడల, నీవు మోక్షమును పొందగలవు. ఈ యోగము తెలుసుకొనిన వారి సంషయములన్ని నివృత్తి కాగలవు. నీలో వున్న ఆత్మయే పురుషుడు. అతనికి ఆద్యంతములు లేవు. అతడు స్వయం ప్రకాశకుడు. పురుషుడు కాని వస్తువేదియు లేదు. పురుషునికి భిన్నమైనదేదియు లేదు. అతడు అంతటా వ్యాపించియున్నాడు. అతడు నిత్యుడు.
ప్రక్రుతి కారణముగా ఆత్మ ఉపాధులతో చేరియున్నది. పురుషుడు నిత్యుడని ఇంతకు ముందు తెలిపియున్నాను. ఈ బహుళ ప్రపంచము నందంతటా వ్యాపించి యున్నది ఆ పురుషుడే. అతడు త్రిగుణాతీతుడు పురుషునికి సంబంధించిన ఈ రెండు విషయములను సమన్వయ పరచుటెట్లు? ఒకటి శుద్దమైనది. రెండవది బహుళ ప్రపంచము. పురుషుడు గుణములకు, ప్రకృతికి అతీతుడెట్లు కాగలిగెను? ఈ లోకములోని జన మరణములతో అతని ప్రమేయము యెట్లు కలిగెను? జ్ఞానులకు ఇది చిత్రవిచిత్రమని గోచరించదు.
ప్రక్రుతి యందు రెండు కీలక శక్తులు కలవు. ఒకటి ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి. త్రిగుణములు నను విభక్తముగా నున్నప్పుడు దానిని నిర్గుణ స్థితి యందురు, అనగా గుణములు లేనట్టి స్థితి. పురుషుని మరొక రూపమే కాలము. కాలము తిరుగుచున్నప్పుడు, త్రిగుణములలో సమత్వము తప్పిపోవును. ఈ సమత్వము లేక సమవిభక్త స్థితి తప్పినపుడు, రజోగుణము ప్రకటితమగును. దాని తర్వాత మిగిలిన రెండును ప్రకటితము కాగలవు.
ఆ విధముగా గుణములు కార్యమునకు దిగినపుడు, ఆవరణ విక్షేపములు కలుగును. ఇప్పుడు పురుషుడు రెండు రూపములు ధరించును. ఒకటి జీవుని రూపముం, రెండవది ఈశ్వర రూపము. గుణములతో కూడిన పురుషుని జీవుడందురు. ఆవరణము, జీవుడు తన సహజ (నిజ) స్వభావమును మరచిపోవునట్లు చేయును అవిద్య చేత ఈ మరపు కలుగుచున్నది. అవిధ్యతో పాటు విక్షేపనము కలుగును. విక్షేపనము కలవరము లేక ఆందోళనను సృష్టించును. దీనినే మాయ అందురు. ఇది అసత్యము సత్యమను భ్రమను కలిగించును అనగా అవిధ్యకు, మాయగా ఆవరణ విక్షేపములే కారణము. ఆవరణ విక్షేపముల చేత జీవాత్మ తన నిజ స్వరూపమును విష్మరించుచున్నాడు. అశాశ్వతమైన ఉపాదులే తానని భ్రమించి ఈ బహుళ ప్రపంచపు ప్రలోభములకు లోనై చిక్కుకొని పోతున్నాడు. ప్రక్రుతి యొక్క ఆవరణ విక్షేప శక్తులను భ్రమింపక, వేరుగా నుండునదే పురుషుని రెండవ స్వరూపమైన ఈశ్వరుడు.
ఈ మాయ నుండి విముక్తి పొంది, అనగా జీవుడు ప్రక్రుతి శక్తులు బంధించలేని స్థితికి చేరుటకు ఒక మార్గము కలదు అదియే భక్తీ యోగము. అమ్మా! ఎల్లప్పుడూ భగవంతున్నే చింతింపుము భక్తీ దానంతటదియే జ్ఞాన వైరాగ్యములను కలిగించును. వాటిని నీవు అన్వేషించ నవసరము లేదు. నారాయణునిపై ప్రేమ పెంపొందినప్పుడు, ఇతర వస్తువులపై ప్రేమ లేకుండ జేయును. ఆ విధముగా వైరాగ్యమలవడును. భక్తి నారాయణుని పాదములు చేరు మార్గమున తీసుకపోవును. నారాయణుని సన్నిధికి చేరుటయే జీవిత లక్ష్యముగా యెంచిన భక్తుడు సత్యమును తెలుసుకొన్న వాడగును. అనగా అతని అవిద్య తొలగినదన్నమాట. నారాయణుడే సత్యమని, యితరమైనవి అసత్యమని తెలుసుకోనును అదియే జ్ఞానము.
వివిధ యోగములు బ్రహ్మమును, పురుషుని, ఈశ్వరుని, భగవంతుని చేరుటకు మార్గమును సూచించు చున్నవి. అనగా గమ్యము ఒకటే. పురుషుడు అనగా ఈశ్వరుడు ఈ బహుళ ప్రపంచమందు అన్నింటియందు వ్యక్తమగుచున్నాడు. దీనిని గ్రహించిన వాడు బ్రహ్మమే యగును. అనగా బ్రహ్మత్వమును గురించి తెలుసుకొనుట కాదు, బ్రహ్మత్వమునే పొందుట. తానె బ్రహ్మమని యెరుక కలిగియుండుట. జీవుడు, తానూ పురుషుడు లేక ఈశ్వరుడనని యెరుగును.

ఇప్పుడు నీకు బోధించిన జ్ఞాన యోగము, ఇంతకు ముందు బోధించిన భక్తి యోగము ఈ రెండును నిజముగా ఒక్కటే. ఒకటి, మరియొక దానికన్నా వేరుకాదు.
అమ్మా! వివిధ మార్గములను నీకు బోధించితిని. ఏ ఒక్క మార్గమునైనను శ్రద్దగా అనుసరించినపుడు నీకు తప్పక మోక్షము లభించగలదని హామీ యిచ్చుచున్నాను.

No comments:

Post a Comment