My Blog List

My Blog List

Monday, March 31, 2014

దత్తాత్రేయ స్వామి చరిత్ర :


మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తోలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మా ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ||న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయననే మరల శ్రీ పాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్దాదులనుద్దరించాడు.

పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనేరాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతోపాటు నిష్టతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశీ తిథి ఒక్క ఘడియ మాత్రమె ఉండగా. దుర్వాస మహర్షి, శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి, త్వరగా అనుష్టానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్ధించాడు. అపుడా మహర్షి, స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథిమించి పొతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలాగని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి ,కొదద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడోచ్చి కోపించి, రాజా, నీవు నానాయోనులలో జన్మింతువు గాక! అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణువేడాడు. అపుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో,మహర్షీ, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్దం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తిమ్పాజేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాషుడుసరే అన్నాడు. స్వామీ అంతా మీ అభీష్టం ప్రకారమే కానీ అన్నాడు. ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు.   
దత్తాత్రేయుని జననం : 
దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంశించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది. అపుడు వారు సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము అన్నారు.
వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమిన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి,నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను. అని చెప్పుకొన్నది. ఆమెయొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయాలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.
ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను యిలా స్తుతించాడు.ఓ మహావిష్ణు! ఈవు సృష్టి-స్థితి-లయ కారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు. విశ్వాధరుడవు. ఓ పరమేశ్వర! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రేడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీ కంటే వేరుగాకపోయిన, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు , నేను-నాదిఅనే మాయతో గూడిన భావన వలన నీకంటె వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది.   
ఊయలలొని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తిచెంది, తమ నిజరూపాలతో ప్రత్యక్షమై. వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీస్టమేమిటో నివేదించుకో అన్నాడు. అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతారకార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించి , మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి.అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు.స్మరించిన తక్షనంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు.

అలనాటి! దుర్వాశ శాపం వల్లనే పరమాత్మాయైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు.అసలు ఆయన అవతరించిందే అందుకు. సర్వజనోద్దరణమనే దత్తావతార కార్యం సృష్టిఉన్నంత వరకు కొనసాగాల్సిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు.


ఆయన ముఖ్యమైన దత్తవతారాలైన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి మరియు షిరిడి సాయిబాబా. 

No comments:

Post a Comment