My Blog List

My Blog List

Monday, March 31, 2014

మానసిక వ్యభిచారమే అన్ని అనర్ధాలకు మూలము :

మానవుడై పుట్టిన ప్రతి వాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారి తెలుసుకోమని ఏర్పరచినాడు. మానవుడు పుట్టిన తరువాత ఈ ప్రకృతి మాయలో పడి దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. ఎప్పుడైతే జీవికి ఆత్మ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మానవుడు సక్రమ మార్గంలో జీవించడానికి వీలు కలుగుతుంది. నిషిద్దమైన కర్మలను ఆచరించకుండా ఉంటె మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు. మానసికమైన వ్యభిచారం కూడ లేకుండా చూసుకోవాలి. మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచారిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టిన మనస్సు మాత్రం విషయాలన్నిటిని తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. దాన్ని అరికట్టడానికి మనస్సుకి తోడుగా ఆత్మ అనే భగవంతునిని దానికి అందించి, ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం మరియు వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్దిస్తుంది.

ఈ మానసిక వ్యభిచారం వలన కలిగే దుస్ఫలితం గురించి ఒక చిన్న వివరణ:
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ సన్యాసి మరియు ఒక వ్యభిచారి ఉండేవారు. బ్రాహ్మణుడు చాల ఉత్తమోత్తముడు . కాని ఆ బ్రాహ్మణుడు ఆ వ్యభిచారికి నువ్వు నరకానికి వెళతావు అని ఆయన హెచ్చరిస్తుండేవాడు. పేదరికంలో ఉన్న ఆ స్త్రీ జీవనోపాధికి తనకున్న ఒకేఒక మార్గాన్ని మార్చుకోలేక తన దైన్యస్థితిని భగవంతునికి తెలియజేస్తూ, రోదిస్తూ, విలపిస్తూ తనను క్షమించమని ఆమె ప్రార్దించేది. ఆ విధంగా వారు ఇద్దరు జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. బ్రాహ్మణుని మనస్సు ఎప్పుడు ఆమె వ్యభిచారిణి అనే ఒక మానసిక ధోరణిలోనే ఉంటూ కాలం గడిపేవాడు. కాల క్రమేణ ఆ ఇద్దరూ చనిపోయారు. వేశ్య స్వర్గానికి వెళ్ళింది. సన్యాసి నరకానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ సన్యాసి అది ఏమిటి నేను బ్రాహ్మణున్ని పైగా ప్రతి నిత్యము భగవంతుణ్ణి ప్రార్ధన చేస్తూ ఉండేవాడిని కదా. నన్ను నరకానికి తెచ్చారు. ఆ వేశ్యను స్వర్గానికి తీసుకెళ్ళారు అని అడిగాడు యమభటులను. అప్పుడు యమ భటులు ఆమె నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి, నా శరీర యాత్ర కోసం నేను ఈ విధంగా చేయవలసి వస్తుంది స్వామి, నన్ను క్షమించు అని ఆమె దేవుణ్ణి వేడుకోనేది. కాని నువ్వు మాత్రం అలా కాదు నీ మనస్సు ఎప్పుడు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండేది. అందువలన నీకు నరకం అని చెప్పారు.


అందువలన ప్రతి ఒక్కరు నిషిద్దమైన కర్మలను చేయకుండ ఉండడమే కాకుండా మానసికమైన వ్యభిచారం కూడ లేకుండా చూసుకోవాలి.          

1 comment:

  1. అన్నీ ఆయనే అయితే, ఏది విహితం, ఏది నిషిద్దం !! భ్రమలో పడకండి. పూర్తి శరణాగతి. స్వామి పాదములను ఆశ్రయించండి. తరించండి. జై శ్రీమన్నారాయణ .

    ReplyDelete